ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టిన హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) పెద్ద షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నాగార్జునకు చెందిన `ఎన్` కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. మాదాపూర్ లో మొత్తం పది ఎకరాల విస్తీర్ణంలో నాగార్జున మరియు నల్ల ప్రీతమ్ రెడ్డి సంయుక్తంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారు.
ఫ్యాషన్ షోలు, వార్షిక వేడుకలు, వివాహాలు, గెట్ టు గెదర్ పార్టీలకు ఎన్ కన్వెన్షన్ పెట్టింది పేరు. అయితే తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని చాలా ఏళ్ల నుంచి ఆరోపణలు ఉన్నారు. ఇటీవల హైడ్రాకు ఫిర్యాదులు కూడా అందగా.. అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. మొత్తం పది ఎకరాల స్థలంలో 1.12 ఎకరాలు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్ టీఎల్) పరిధిలో, మరో 2 ఎకరాలు బఫర్ జోన్ లో ఉన్నాయని విచారణలో తేలడంతో.. హైడ్రా బృందం శనివారం ఉదయం ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసింది.
అయితే ఈ కూల్చివేత కారణంగా నాగార్జున భారీగానే నష్టపోయారని ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. పలు నివేదిక ప్రకారం.. ఎన్ కన్వెన్షన్ సెంటర్ మొత్తం విలువ రూ. 400 కోట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ ఎన్ కన్వెన్షన్ లో మొత్తం 4 హాళ్లు ఉంటాయి. వాటి అద్దె రోజుకు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుందట. ప్రతి ఏడాది నాగార్జునకు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ద్వారా రూ. 100 కోట్లకు పైగా ఆదాయం వస్తుందట. ఇప్పుడు హైడ్రా అధికారులు దాన్ని కూల్చివేయడంతో నాగార్జునకు కొన్ని వందల కోట్లలో నష్టం వాటిల్లిందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.