ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ పాలన అస్తవ్యస్థంగా మారిందని, ఏపీలో హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నా జగన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా ఆలయాలు, హిందూ దేవతల విగ్రహాలు, రథాలు, ధ్వజస్తంభాలపై దాడి ఘటనలపై జగన్ సర్కార్ తీరు ఉదాసీనంగా ఉందని విపక్షాలు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని దుయ్యబడుతున్నాయి.
ఇన్ని ఘటనలు జరిగినప్పటికీ జగన్ తీరులో ఏ మాత్రం మార్పు లేదని పలువురు హిదూ మత పెద్దలు మండిపడుతున్నారు. ఈ విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే ఇటీవల విశాఖ జిల్లా సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉపాలయమైన సీతారామ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం కూలిపోయిన ఘటన కలకలం రేపింది. సుమారు 60 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఈ పురాతన ధ్వజస్తంభం అవసాన దశకు చేరుకుందని, దాని స్థానంలో కొత్త ధ్వజస్తంభం ప్రతిష్టించాలని స్థానికులు చాలాకాలంగా చెబుతున్నా…ఎవరూ పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ పై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. ఏపీలో హిందువులకు, హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఏపీలో చేతగాని ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. ధ్వజస్తంభం విరిగిపడడంతో తాత్కాలిక ఏర్పాట్లు చేశారని ఆ ప్రాంతాన్ని సందర్శించిన స్వామీజీ ఆవేదన వ్యక్తం చేశారు. ధ్వజస్తంభం దేవాలయానికి ప్రాణమని, ధ్వజస్తంభం స్థితిగతులు, కాలప్రమాణం ఎంత? అన్నది పరిశీలించాల్సిన బాధ్యత దేవాదాయ శాఖ అధికారులకు ఉంటుందని గుర్తు చేశారు.
ధ్వజస్తంభం పరిస్థితి బాగోలేదని, పడిపోయే పరిస్థితి ఉందని స్థానికులు హెచ్చరించినా అధికారులు పట్టించుకోలేదని దేవాదయ శాఖ తీరుపై మండిపడ్డారు. ఈ ఘటనకు దేవాదాయ శాఖ మంత్రి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, లేకుంటే ఘోరం జరిగి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు.