తమిళ కథానాయకుడు విశాల్ ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ అని అందరికీ తెలిసిందే. తెర మీద యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలు పోషించే విశాల్.. బయట కూడా బోల్డ్‌గా మాట్లాడుతుంటాడు. అతను తాజాగా ఓ సంచలన విషయాన్ని బయటపెట్టి టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాడు. తన కొత్త చిత్రం మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ రిలీజ్ కోసం ముంబయిలో సెన్సార్ బోర్డు అధికారులకు ఆరున్నర లక్షల లంచం ఇచ్చినట్లు అతను వెల్లడించాడు.
ఏదో వేగ్గా ఆరోపణలు చేయడం కాకుండా ఎవరెవరికి ఎంత డబ్బులు లంచం రూపంలో ఇచ్చింది.. ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది వివరిస్తూ అతను ట్విట్టర్లో పోస్టు పెట్టేశాడు. ఈ అన్యాయంపై అతను వీడియో కూడా రిలీజ్ చేశాడు.
సినిమాల్లో అవినీతి చూపించడం ఓకే కానీ.. నిజ జీవితంలో అవినీతి అంటే తట్టుకోలేనని.. అది కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి దారుణమని పేర్కొంటూ తాను సెన్సార్ ఆఫీస్ అధికారులకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చినట్లు విశాల్ వెల్లడించాడు. స్క్రీనింగ్ కోసం రూ.3 లక్షలు.. సర్టిఫికేషన్ కోసం మూడున్నర లక్షలు లంచం ఇచ్చానని తెలిపాడు.
తన సినిమా రిలీజ్ కోసం ఆ పని చేయక తప్పలేదని… ముంబయికి చెందిన మీడియేటర్ ఇదంతా చేసి పెట్టాడని.. తాను కష్టపడి సంపాదించిన డబ్బులు ఇలా లంచంగా ఇవ్వాల్సి రావడాన్ని జీర్ణించుకోలేకపోయానని విశాల్ తెలిపాడు. ఈ విషయాన్ని మహారాష్ట్ర హైకోర్టు దృష్టికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తున్నట్లు విశాల్ చెప్పాడు. ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని.. దీనిపై చర్యలు చేపడతారని ఆశిస్తున్నట్లు అతను తెలిపాడు. సెన్సార్ బోర్డులో స్క్రీనింగ్, సర్టిఫికేషన్ కోసం డబ్బులు డిమాండ్ చేయడం.. ప్రొడ్యూసర్లు కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని సినిమాను బయటికి తీసుకురావడం గురించి ఆరోపణలు వస్తుంటాయి. కానీ విశాల్ ధైర్యంగా ఈ విషయాన్ని బయటపెట్టి సంచలనం రేపాడు.