ఈ సంక్రాంతికి విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన సినిమా.. సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ హీరోగా మీడియం బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ అద్భుతాలు చేస్తోంది. ఆల్రెడీ రూ.200 కోట్లకు పైగా వసూళ్ల మార్కును దాటేసింది. ఫుల్ రన్లో రూ.300 కోట్ల వసూళ్లు సాధించినా ఆశ్చర్యం లేదు. విడుదలకు ముందే ఈ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ అయినప్పటికీ.. మరీ ఈ స్థాయిలో వసూళ్ల మోత మోగించడం, రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్లడం అనూహ్యం.
తాను ఇంత పెద్ద హిట్ సినిమా తీయడం వెనుక సూపర్ స్టార్ మహేష్ బాబు స్ఫూర్తి ఉన్నట్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం. మహేష్ ఇచ్చిన ఐడియాతోనే ఈ సినిమాకు శ్రీకారం చుట్టినట్లు అతను తెలిపాడు. ‘ఎఫ్-2’ సూపర్ హిట్ అయ్యాక అనిల్.. మహేష్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తీసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి మహేష్‌తో తనకు మంచి అనుబంధం ఏర్పడిందని అనిల్ చెప్పాడు.
ఈ క్రమంలోనే ‘భగవంత్ కేసరి’ సినిమా చేస్తున్న సమయంలో తనతో మహేష్ మాట్లాడినట్లు అనిల్ వెల్లడించాడు. ఆ సమయంలోనే రిలీజైన ‘జైలర్’ సినిమా చూసి.. ఇలాంటి ఫ్యామిలీ టచ్ ఉన్న ఎంటర్టైనర్ తీయమని తనకు మహేష్ సూచించినట్లు తెలిపాడు అనిల్. టాలీవుడ్లో ప్రస్తుతం కామెడీ బాగా డీల్ చేయగల దర్శకుల్లో తాను ఒకడిని అని గుర్తు చేస్తూ ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ రెండూ ఉన్న ఎంటర్టైనర్ తీయమని మహేష్ తనకు చెప్పాడన్నాడు అనిల్.
మహేష్ లాంటి పెద్ద స్టార్ తన గురించి అంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడ్డంతో తాను ఆయన చెప్పినట్లే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కథను రాసి ఇప్పుడు పెద్ద హిట్ కొట్టినట్లు అనిల్ వెల్లడించాడు. మహేష్ ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశారని.. ఆయన పిల్లలు సితార, గౌతమ్ సైతం కొన్ని సీన్లకు పడి పడి నవ్వుకున్నట్లు చెప్పారని అనిల్ తెలిపాడు. సెల్యూట్ చేశాక వెంకటేష్ చెయ్యి పట్టేయడం.. జైలర్ పాత్రకు సంబంధించి సీన్ల గురించి మహేష్ ప్రత్యేకంగా ప్రస్తావించి తనను మెచ్చుకున్నట్లు అనిల్ చెప్పుకొచ్చాడు.