చేతిలో అధికారం ఉన్న వేళ.. ప్రజాప్రతినిధులు ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటి వారు అనుకోని రీతిలో ప్రమాదంలో చిక్కుకుంటే? ఊహే భయంకరంగా ఉంటుంది కదా? కానీ.. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేటర్లు పలువురు రాష్ట్రం కాని రాష్ట్రంలో విపత్తులో ఇరుక్కుపోయారు.
విశాఖ నుంచి స్టడీటూర్ లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లిన వారు అనుకోని రీతిలో చిక్కుకుపోయిన వైనం సంచలనంగా మారటంతో పాటు.. వారి కుటుంబాలు.. అనుచరులు ఆందోళనకు గురయ్యే పరిస్థితి. అసలేం జరిగిందంటే..
ఈ నెల 16న విశాఖపట్నం నగరపాలక సంస్థకు చెందిన 95 మంది కార్పొరేటర్లు.. వారి కుటుంబ సభ్యులు స్టడీ టూర్ లో భాగంగా కులుమనాలి వెళ్లారు. తాజాగా అక్కడి నుంచి చండీగఢ్ కు వెళుతుండగా.. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి మార్గమధ్యంలో చిక్కుకుపోయారు. దీంతో వారు ప్రయాణిస్తున్న బస్సుల్లోనే ఉండిపోయి.. కాలం గడుపుతున్నారు.
విరిగి పడిన కొండ చరియల్ని క్లియర్ చేసేందుకు సహాయక సిబ్బంది వచ్చినప్పటికీ.. తెరిపి లేకుండా కురుస్తున్న వానతో రహదారులపై పడిన కొండ చరియల్ని తరలించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు.
కొండ చరియలు విరిగిపడిన ఉదంతంలో కార్పొరేటర్లు అందరూ క్షేమంగా ఉన్నారని.. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెబుతున్నారు. రోడ్లను క్లియర్ చేయటానికి దాదాపు 12 గంటల సమయం పడుతుందని పేర్కొంటున్నారు. దీంతో వారి పరిస్థితి దారుణంగా మారిందని వాపోతున్నారు.
చండీగఢ్‌కు 170కి.మీ. దూరంలో ఉన్న వేళలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకు ఢిల్లీ.. హిమాచల్ ప్రదేశ్.. సిమ్లా.. కులుమనాలిలో పర్యటించిన వారు.. కులు నుంచి చండీగఢ్ కు వెళ్లే సమయంలో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుందని చెబుతున్నారు.అధికారానికి.. దర్పానికి.. హోదాకు తిరిగులేని వారికి.. గంటల తరబడి ఏమీ చేయలేక బస్సుల్లోనే ఉండిపోవాల్సి రావటంతో వారు ఇబ్బందులకు గురైనట్లుగా తెలుస్తోంది.
రాత్రి మొత్తం బస్సుల్లోనే ఉండాల్సి రావటంతో వారికి కాళరాత్రి అనుభవం ఎదురైనట్లుగా చెప్పొచ్చు. సాధారణంగా ఇలా చిక్కుకుపోయిన ప్రజల్ని కాపాడే బాధ్యతను తీసుకునే కార్పొరేటర్లకు.. ప్రతిగా తామే బాధితులుగా మారటం.. సాయం కోసం ఎదురుచూడాల్సి రావటంతో వారికిదిచేదు అనుభవంగా మారిన పరిస్థితి.