సంక్రాంతి సినిమాలకు సంబంధించి చాలా రోజులుగా థియేటర్ల విషయమై గొడవ నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గుంటూరు కారం, హనుమాన్ చిత్రాల మధ్య థియేటర్ల కేటాయింపులో అంతరంపై పెద్ద చర్చ జరిగింది. ఆ వ్యవహారం ఇంకా కూడా కొలిక్కి రాలేదు. ఈ లోపు కొత్త వివాదం తెరపైకి వచ్చింది. బుక్ మై షోలో తమ చిత్రానికి తక్కువ రేటింగ్స్ రావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు గుంటూరు కారం టీం ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మహేష్ బాబు, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరు కారం చిత్రానికి డివైడ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు బుక్ మై షోలో మరీ తక్కువగా 6.6 రేటింగ్ మాత్రమే చూపిస్తోంది. అల్ట్రా డిజాస్టర్ సినిమాలకు మాత్రమే ఆ రేటింగ్ వస్తుంది బిఎంఎస్ లో. అయితే తమ చిత్రానికి ఇంత లో రేటింగ్ రావడం వెనుక కుట్ర దాగి ఉందని గుంటూరు కారు టీమ్ ఆరోపిస్తోంది. కొందరు పనిగట్టుకొని సోషల్ మీడియా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి సింగిల్ రేటింగ్ ఇచ్చారని.. ఇలా వేలమంది చేయడంతో ఓవరాల్ రేటింగ్ తగ్గిపోయిందని.. అలాగే బుక్ మై షోలో పెద్ద ఎత్తున నెగెటివ్ రివ్యూలు కూడా పోస్ట్ చేశారని.
తమ సినిమాను దెబ్బ కొట్టే ఉద్దేశంతోనే ఇలా చేశారని.. గుంటూరు కారం టీమ్ ఫిర్యాదు చేసింది. కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు రివ్యూ, రేటింగ్స్ కోసం వెబ్సైట్ల మీదే కాక ప్రేక్షకులు బుక్ మై షో మీద కూడా ఆధార పడతారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇష్యూను గుంటూరు కారం టీమ్ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.