కాపు నేత, మాజీ మంత్రి హరిరామ జోగయ్య…వైసీపీ నేత, మంత్రి గుడివాడ అమర్ నాథ్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మంత్రి పదవి కోసం కాపుల భవిష్యత్తును తాకట్టుపెట్టొద్దంటూ అమర్ నాథ్ కు రామజోగయ్య రాసిన లేఖ పెను దుమారం రేపుతోంది. పవన్ కల్యాణ్ పై అనవసరంగా బురదజల్లే ప్రయత్నం చేయొద్దని సూచించారు. అయితే, ఆ లేఖను పవన్ కల్యాణ్ కు పంపబోయి తనకు పంపారని రామజోగయ్యకు అమర్ నాథ్ కౌంటర్ ఇచ్చారు.
అంతేకాదు, టీడీపీ, జనసేనల పొత్తును ఎలా సమర్థిస్తారని హరిరామజోగయ్యను తాజాగా రాసిన రెండో లేఖలో ప్రశ్నించారు. గౌరవనీయులైన హరిరామజోగయ్య గారికి అని సంబోధించిన అమర్ నాథ్…వంగవీటి రంగా హత్య గురించి ప్రస్తావించారు. రంగాను చంపించింది చంద్రబాబేనని గతంలో హరిరామ జోగయ్య ఆరోపించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అటువంటి చంద్రబాబుతో పొత్తులకు సిద్ధమైన పవన్ ను రామజోగయ్య సమర్థిస్తారా? అని అమర్ నాథ్ ప్రశ్నించారు. దీంతో, బాబు, పవన్ ల పొత్తుపై అమర్ నాథ్ అక్కసు వెళ్లగక్కారని కామెంట్లు వస్తున్నాయి.
అంతకుముందు, అమర్ నాథ్ కు హరి రామ జోగయ్య రాసిన లేఖ వైరల్ అయింది. ‘Dear అమర్నాథ్.. నువ్వు రాజకీయాల్లో బచ్చావి.. పైకి రావాల్సిన వాడివి.. సాధారణ మంత్రి పదవికి అమ్ముడు పోయి కాపుల భవిష్యత్తుని పాడు చేయకు. అనవసరంగా పవన్ కళ్యాణ్‌పై బురద చల్లడానికి ప్రయత్నం చేయకు. నీ భవిష్యత్ కోరి చెబుతున్నా.’అంటూ అమర నాథ్ కు ఆయన లేఖ రాశారు.