తెలంగాణలో సీఎం కేసీఆర్ వర్సెస్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వార్ కొనసాగుతూనే ఉంది. రాజ్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్ గైర్హాజరయ్యారు. ఈ క్రమంలోనే కేసీఆర్ పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై తమిఇసై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనలు, కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రానికి నివేదిక ఇచ్చానని గవర్నర్ అన్నారు. రెండేళ్ల నుంచి రాజ్‌భవనంపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ప్రభుత్వం రాజ్యాంగ విలువలు పాటించడంలేదని తమిళిసై ఆరోపించారు.
పుదుచ్చేరిలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న తమిళిసై…కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. 5 లక్షల మందితో కేసీఆర్ ఖమ్మంలో బహిరంగ సభ పెట్టారని, ఆ సభకు లేని కరోనా రిపబ్లిక్ డేకు గుర్తు వచ్చిందా? అని ప్రశ్నించారు. అభివృద్ధి అంటే భవనాలు నిర్మించడం కాదని, జాతి నిర్మాణం అని కొత్త సచివాలయాన్ని ఉద్దేశించి తమిళిపై విమర్శించారు. ఫామ్‌హౌస్‌లు కట్టడం కాదని, అందరికి ఫార్మ్‌లు కావాలని, రైతులు, పేదలు అందరికీ భూములు, ఇళ్లు కావాలని కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
మన పిల్లలు విదేశాల్లో చదవడం అభివృద్ధి కాదని, రాష్ట్రంలోని విద్యాలయాల్లో అంతర్జాతీయ సౌకర్యాలు ఉండాలని తమిళిసై అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు నడుచుకోవాలని సూచించారు. కొంతమందికి తాను నచ్చకపోవచ్చని.. కానీ తెలంగాణ ప్రజలంటే తనకు ఇష్టమని తమిళిసై చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో తన పాత్ర తప్పక ఉంటుందని అన్నారు.
ఈ క్రమంలోనే తమిళిసై పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. రిపబ్లిక్ డే నాడు గవర్నర్ రాజకీయ వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, గవర్నర్ విషయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కలగజేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గవర్నర్ తీరుపై రాష్ట్రపతికి లేఖ రాస్తామని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలో ఉంటూ ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం దారుణమని అన్నారు.