వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఒక్కటే ఇది పాత సామెత….ప్రభుత్వం మనోళ్లదైతే ఏం చేసినా…ఎలా ఆడినా చెల్లుతుంది…ఇది అప్డేటెడ్ సామెత. అందులోనూ, జగన్ సీఎం అయిన తర్వాత అధికార పార్టీ సానుభూతి పరులకు, కార్యకర్తలకు, నేతలకు ఒక న్యాయం…ప్రతిపక్షానికి చెందిన వారికి అన్యాయం జరగడం సర్వ సాధారణం అయింది. ఓ వైపు కోర్టులను, జడ్జిలను కించపరిచేలా పోస్టులుపెట్టిన వైసీపీ సానుభూతిపరుడు పంచ్ ప్రభాకర్ ను అరెస్టు చేయండంటూ స్వయంగా హైకోర్టు మొత్తుకుంటున్నా….ఏపీ సీఐడీ మీనమేషాలు లెక్కిస్తోంది.
అదే, టీడీపీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రభుత్వ అసంబద్ధ విధానాలను విమర్శిస్తే మాత్రం సీఐడీ అధికారులు ఆఘమేఘాల మీద వాలిపోయి అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రాజమండ్రి టీడీపీ సోషల్ మీడియా విభాగం సమన్వయకర్త సంతోష్ ను రాజమండ్రిలో అరెస్టు చేసేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నించారు. ఓ సోషల్ మీడియా పోస్టు విషయంలో సంతోష్ ను అదుపులోకి తీసుకునేందుకు సీఐడీ అధికారులు వచ్చారు.
అయితే, ఈ విషయం తెలుసుకున్న టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ అరెస్టును అడ్డుకున్నారు. నోటీసులివ్వకుండా సంతోష్ ను ఎలా అరెస్ట్ చేస్తారని సీఐడీ అధికారులను గోరంట్ల నిలదీశారు. సోషల్ మీడియా పోస్టుల కేసుల పేరుతో సంతోష్ వంటి టీడీపీ కార్యకర్తలను ప్రభుత్వం వేధిస్తోందని గోరంట్ల మండిపడ్డారు. సంతోష్ భార్య నిండు గర్భవతి అని, ఆమె ఆసుపత్రిలో ఉందని, ఈ సమయంలో సంతోష్ ను అరెస్ట్ చేయడం కక్షపూరితమేని అన్నారు.
అంతేకాదు, ఆసుపత్రి వద్ద సంతోష్ ను సీఐడీ అధికారులు అరెస్టు చేయకుండా గోరంట్ల కుర్చీ వేసుకుని అడ్డుగా బైఠాయించారు. సోషల్ మీడియా పోస్టుల విషయంలో కేసులుండవు, వేధింపులుండవు అని సుప్రీం కోర్టు చెబుతున్నా…జగన్ నాయకత్వంలో మాత్రం ఏపీలో కొత్త రాజ్యాంగ విధానాలు అమలు చేస్తున్నారని గోరంట్ల మండిపడ్డారు. సీఐడీ అధికారులతో గోరంట్ల వాగ్వాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో, సీఐడీ అధికారులకు చుక్కలు చూపించిన గోరంట్ల అంటూ టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. ఎదో సోషల్ మీడియా కేసు ఉంది అని తెలుగుదేశం సానుభూతి పరుడు పై కక్ష తీర్చుకొనేందుకు అరెస్ట్ చేయాలని చూడడం దారుణం.అతని భార్య ఈ రోజు డెలివరీ ఉంది అని తెలిసి కూడా ఇలా కక్ష తీర్చుకోవాలనుకోవడం దుర్మార్గపు చర్య.ఒక పక్క సుప్రీం కోర్టు సోషల్ మీడియా pic.twitter.com/AhehiK058r
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) December 16, 2021