ఉప్పల్ స్టేడియం ఊగిపోయింది. తమ అభిమాన క్రికెటర్ బ్యాట్ తో ఝుళిపించి.. కివీస్ బౌలర్లను ఊచకోత కోయించి.. స్కోర్ బోర్డును పరుగులు తీయటమే కాదు.. భారీ స్కోర్ ను సాధించిన వైనంతో వేలాది క్రికెట్ అభిమానులు స్టేడియంలో ఊగిపోతే.. ఆ పూనకాలు యావత్ దేశాన్ని ఊపేశాయి. ఓపెనర్ గా బ్యాట్ పట్టుకొని వచ్చిన గిల్ కళాత్మక విధ్వంసంతో బౌలర్లను ఉతికి ఆరేసిన అతడు.. 149 బంతుల్లో పందొమ్మిది ఫోర్లు.. తొమ్మిది సిక్సర్లు కొట్టేసి. .ఏకంగా 208 పరుగులు చేశారు. దీంతో.. స్కోర్ బోర్డు పరుగులు తీసి 349 పరుగులు చేసింది.
ప్రత్యర్థికి 350 పరుగుల విజయ లక్ష్యాన్ని ముందు పెట్టింది. అయితే.. కివీస్ బ్యాట్ మెన్లు చెలరేగిపోయి.. భారీ స్కోర్ కు సమీపానికి వచ్చేసి టెన్షన్ పెట్టించినా.. బౌలర్ల నియంత్రణ మ్యాచ్ ను సొంతం చేసుకోవటంతో పాటు.. అంతులేని ఆనందాన్ని ఇచ్చిందని చెప్పాలి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఓపెనర్లుగా గిల్ చెలరేగిపోయారు. తన కెరీర్ లో తొలిసారిగా డబుల్ సెంచరీని సాధించాడు. మూడుసార్లు ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అతను.. తనకు ఎదురులేదన్నట్లుగా చెలరేగిపోయాడు. చూడచక్కని షాట్లను ఫోర్లు.. సిక్సులు కొట్టేసి అభిమానుల పరుగుల దాహాన్ని తీర్చాడు.
ఓవైపు గిల్ చెలరేగిపోతుంటే.. మరోవైపు భారత్ బ్యాట్స్ మెన్లు ఔట్ అవుతున్నా.. ఆ ప్రభావం ఏదీ తన మీద పడకుండా చూసుకున్నాడు గిల్. కోహ్లీ 8, ఇషాన్ కిషన్ 5, సూర్యకుమార్ యాదవ్ 31 తదితర ఆటగాళ్లువచ్చి వెళుతున్నా.. తన ఊపును మాత్రం కొనసాగించాడు. అన్నింటికి మించి 49వ ఓవర్లో.. ఏకంగా మూడు సిక్సర్లు బాదేసి.. డబుల్ సెంచరీని సొంతం చేసుకోవటంతో పాటు.. స్కోర్ బోర్డు 340 వరకు తీసుకెళ్లాడు. చివర్లో ఔటయ్యాడు. బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా తన మొదటి ఆరు ఓవర్లలో ఒక్క సింగిల్ పరుగు కూడా తీయపోవటం చూస్తే.. ఆటగాళ్లు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
బ్యాట్ తో గిల్ చెలరేగిపోతే.. బంతితో హైదరాబాదీ ఆటగాడు మహ్మద్ సిరాజ్ తన సత్తానుచాటారు. చివరి ఓవర్లకు వచ్చేసరికి.. కివీస్ బ్యాట్స్ మెన్ల అద్భుత ఆటతో.. గెలుస్తామా? లేదా? అన్న టెన్షన్ ను తెప్పించారు. స్కోర్ బోర్డును చూసినప్పుడు పరుగుల తేడా చాలా కనిపిస్తున్నా.. బ్యాట్ తో ఉతికి ఆరేసే బ్యాట్స్ మెన్లు క్రీజ్ లో ఉన్న వేళ..తుది ఫలితం ఏమవుతుందన్న టెన్షన్ తీవ్రంగా మారింది. దీంతో.. నరాలు తెగే టెన్షన్ వేళ.. ఎంట్రీ ఇచ్చిన మహ్మద్ సిరాజ్.. చెలరేగి ఆడుతున్న శాంట్నర్ ను .. షిఫ్లీని వరుస బంతుల్లో ఔట్ చేయటంతో.. భారత్ విజయం ఖరారైంది. అప్పటివరకు తీవ్రమైన టెన్షన్ తో ఉన్న టీమిండియా అభిమానులుఒక్కసారిగా గుండెల నిండా ఊపిరి పీల్చుకొని.. ఆనందంతోసంబరాలు చేసుకున్నారు.
గిల్ విధ్వంస బ్యాటింగ్.. బౌలర్ల సమిష్టితనంతో బౌల్ చేయటంతో టీమిండియా విజయం సాధించటానికి వీలు కుదిరింది. బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు.. కులదీప్ రెండు వికెట్లు.. శార్దుల్ రెండు, షమి, హార్దిక్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. విజయం కోసం న్యూజిలాండ్ తీవ్రంగా పోరాడినప్పటికీ టీమిండియా ఆట కారణంగా కివీస్ 49.2 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియాకు 1-0అధిక్యత లభించింది. ఇక.. శుభమన్ గిల్ విషయానికి వస్తే.. ఉప్పల్ స్టేడియంలో అత్యధిక స్కోర్ చేసిన బ్యాట్స్ మెన్ గా ఇప్పటివరకు సచిన్ రికార్డును తాజాగా తన పేరు మీదకు మార్చుకున్నారు. అంతేకాదు..వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్ లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్ గా నిలిచారు. ఇవన్నీఒక ఎత్తు అయితే.. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఐదో బ్యాట్స్ మెన్ గా.. నిలిచారు. ప్రపంచ క్రికెట్ లో గిల్ ది ఎనిమిదో స్థానం కావటం గమనార్హం. వీటితో పాటు చిన్న వయసులో అంటే.. 23 ఏళ్ల 132 రోజులకే డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా శుభమన్ నిలిచారు. అంతకు ముందు ఈ రికార్డు ఇషాన్ కిషన్ పేరుతో ఉంది.