అనూహ్య నిర్ణయాల్ని తీసుకోవటం.. దీర్ఘకాలికంగా పరిష్కారం కాని అంశాల మీద ఫోకస్ పెట్టి మరీ లెక్క తేల్చే విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తన మార్కును చూపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని రీతిలో సరికొత్తగా ఆయన నేతృత్వంలోని కొలీజియం చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా 49 ఏళ్ల ఢిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయవాది సౌరభ్ కృపాల్ను న్యాయమూర్తిగా ప్రతిపాదించాలన్న ఫైల్ మీద తుది నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఆయన్ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపిక చేయాలన్న ఫైల్ 2018లోనే సుప్రీం కొలీజియం ముందుకు వచ్చింది. అప్పట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ బొబ్డే కొలీజియం ముందుకు ఆయన లైంగిక ఇష్టాయిష్టాల మీద వచ్చిన అభ్యంతరాల మీద చర్చ జరిగింది. వరుసగా రెండేళ్లు ఇదే అంశం మీద చర్చ జరిగినప్పటికీ.. ఆయన విషయంలో తుది నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు.
తాజాగా మాత్రం అందుకు భిన్నంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని కొలీజియం మాత్రం ఊహించని నిర్ణయాన్ని తీసుకోవటం ద్వారా.. కొత్త అడుగుకు నాంది పలికారని చెప్పాలి. ఆయన్ను న్యాయమూర్తిగా ప్రతిపాదిస్తూ చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే.. సుప్రీం కొలీజియం చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పాల్సి ఉంటుంది. సాధారణంగా కొలీజియం ప్రతిపాదించిన పేర్లను కేంద్రం దాదాపుగా ఓకే చెబుతోంది. చాలా అరుదుగా మాత్రమే నో చెప్పే పరిస్థితి ఉంటుంది.
ప్రగతిశీల భావాలతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించే అవకాశాలే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక.. కృపాల్ లైంగిక ఇష్టాయిష్టాలపై నిఘా వర్గాల సమాచారం రావడంతో ఆయనపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ అంతర్గతంగా నడుస్తోంది. దీనికి తోడు.. ఆయన జీవిత భాగస్వామిగా వ్యవహరిస్తున్న వారు స్విస్ రాయబార కార్యాలయంలో పని చేస్తున్న యూరోపియన్ కావటంతో అతడి జాతీయతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
అయితే.. కృపాల్ ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాల్లో నాయ్య శాస్త్రం చదివారన్న విషయంపై చర్చ సాగింది. ఆయన తండ్రి భూపీందర్నాథ్ కృపాల్ 2002 మే నుంచి నవంబరు మధ్య సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రతిపాదిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వెలువడుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.