హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో గ్యాంగ్ రేప్ ఘటన కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. గాంధీలో చికిత్స పొందుతోన్న రోగికి సహాయకులుగా ఉన్న ఇద్దరు మహిళలపై ఆస్పత్రి సిబ్బంది అత్యాచారం ఆరోపణలు పెనుదుమారం రేపాయి. బాధితులకు మత్తుమందు ఇచ్చి, 3 రోజులపాటు రూంలో ఉంచి అత్యాచారం చేసిన అమానుష ఘటనపై మహిళఆ సంఘాలు మండిపడుతున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు విచారణ ప్రారంభించారు.
ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి స్పందించారు. అత్యాచార ఘటనపై అక్కడి వైద్య సిబ్బందిని ఆరా తీశారు. ఆస్పత్రి వైద్యాధికారి రాజారావుని వివరణ కోరారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒకరిని అరెస్టు చేశారని, విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు. అయితే, ఈ వివాదంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు ఓ మీడియా చానెల్ కు ఇచ్చిన వివరణ చర్చనీయాంశమైంది.
గ్యాంగ్ రేప్ జరిగిందని ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని, మీడియా నుంచి ఒక మెసేజ్ వచ్చిందని అన్నారు. ఆ మెసేజ్‌ను పోలీసులకు పంపించి ఆస్పత్రిలో కూడా అధికారులతో కమిటీ వేశానన్నారు. షెడ్లో బాధితురాలు కనిపించినట్లు సీసీ కెమెరాలో ఉందని, అయితే, అత్యాచారం సెల్లార్లో జరిగే అవకాశమే లేదని చెప్పారు. సెల్లార్ లో క్యాంటిన్, ఒక డిపార్ట్మెంట్, మెడికల్ స్టోర్, దోబీఘాట్ ఉన్నాయని, కాబట్టి అక్కడ గ్యాంగ్ రేప్ జరిగే అవకాశమే లేదని ఆయన అన్నారు. పోలీసులు,ఆస్పత్రి సిబ్బంది విచారణ జరుపుతున్నారని, నిందితులకు శిక్ష పడుతుందని అన్నారు.సంబంధించి పోలీసులు ఒకరిని అరెస్టు చేశారని, విచారణ జరుగుతోందని చెప్పారు.
అయితే, బాధితురాలు తన సోదరి చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి వచ్చిందని, గాంధీలో ఎక్స్ రే డిపార్ట్ మెంట్ లో పనిచేసే మహేష్ తో బాధితురాలికి పరిచయం ఉందని విచారణలో తేలింది. ఈ పరిచయంతోనే పేషెంట్ దగ్గర ఒక్కరే ఉండాలని చెప్పి బాధితురాలిని మహేష్ ..సెక్యూరిటీ గదిలోకి తీసుకువెళ్లి మత్తు మందిచ్చి రేప్ చేశారని తెలుస్తోంది. మహేష్ తోపాటు సెక్యూరిటీగార్డ్ కూడా ఈ గ్యాంగ్ రేప్ లో పాల్గొన్నాడని తెలుస్తోంది. అయితే, బాధితురాలి సోదరి ఆస్పత్రిలో కనిపించకపోవడం ఇపుడు చర్చనీయాంశమైంది.