తెలుగు న్యూస్ చానళ్ల పేరున్న అతి కొద్దింటిలో ఎన్ టీవీ ఒకటి. టాప్ ఫైవ్ చానళ్లలో తన స్థానాన్ని ఏ రోజు కోల్పోని రికార్డు ఈ చానల్ సొంతం. అనూహ్యంగా ఒక కేసు ఇప్పుడా చానల్ అధినేతను ఇబ్బందికి గురి చేస్తున్నట్లు చెబుతున్నారు.
హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు అందిన కంప్లైంట్ లో పేర్కొన్న అంశాలు షాకింగ్ గా మారాయి. తాజా ఈ ఫిర్యాదుపై హైకోర్టు విచారణకు స్వీకరించినట్లుగా చెబుతున్నారు.
దాదాపు.. ఆరేడు పేజీలు ఉన్న ఈ కంప్లైంట్ కాపీలోని వ్యవహారాలు భారీగా ఉన్నాయి. ఒకవేళ.. ఈ ఉదంతం విచారణ దిశగా అడుగులు పడి.. చర్యలు షురూ అయితే మాత్రం కొత్త సంచలనాలకు తెర తీస్తుందన్న మాట వినిపిస్తోంది.
అయితే.. ఇంత రచ్చకు కారణం.. జూబ్లిహిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఉన్న రెండు వర్గాల మధ్య విభేదాలని కొందరు తేల్చి చెబుతున్నా.. అదేమీ లేదు.. మోసం చేసిన వారిని చూస్తూ ఊరుకోలేం కదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఇంతకీ ఎన్ టీవీ అధినేతతో పాటు మరికొందరి మీద ఉన్న అభియోగాన్ని చూస్తే..
జూబ్లీహిల్స్ సొసైటీ పరిధిలోని 853 ఎఫ్ ప్లాట్ ను అతి తక్కువ ధరకు ఫోర్జరీ సంతకంతో నరేంద్ర చౌదరి తమ వారికి కట్టబెట్టినట్లుగా ఆరోపిస్తున్నారు. 1988లో శిరీష అనే మైనర్ కు ప్లాట్ అలాట్ చేశారని.. ఆమె నరేంద్ర చౌదరి అక్క కుమార్తెగా చెబుతున్నారు. అలాట్ చేసిన ప్లాట్ ను నిబంధనలకు విరుద్దంగా 1991 నవంబరులో రిజిస్టర్ చేసినట్లుగా చెబుతున్నారు.
ఈ ఉదంతంలో సొసైటీకి రూ.45 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. అలాట్ అయిన తర్వాత ఆలస్యంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవటమే కాదు.. మూడేళ్లలో ఇంటిని నిర్మించుకోవాల్సి ఉన్నా.. 30 ఏళ్లుగా అలాంటిదేమీ జరగలేదన్నది మరో ఆరోపణ. దీనిపై విచారణ ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు హైదరాబాద్ లోని హై సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.