కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. అంతవరకుబాగానే ఉండి.. అప్పుడే కరోనా పాజిటివ్ అన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. తర్వాతేం చేయాలో ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి. కరోనా రాక ముందు ఉండే బింకం.. వచ్చిందన్న విషయం తెలిసిన వెంటనే నీరసపడిపోయే పరిస్థితి. ఏం చేయాలో తోచని దుస్థితి. ఇదిలా ఉంటే.. ఇంట్లో ఒకరికి పాజిటివ్ అని తేలిన తర్వాత.. సెకండ్ వేవ్ లో ఇంట్లోని వారందరికి వచ్చేస్తోంది.కరోనా బారిన పడిన వేళ.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినటం చాలా అవసరం. అలా అని.. ఆరోగ్యవంతుల మాదిరి రకరకాల వెరైటీలు వండుకునే ఓపిక ఉండదు.
విపరీతమైన నీరసం.. అంతకు మించిన అలసటతో రెస్టు తీసుకోవాలనిపిస్తుందే తప్పించి.. పని చేయాలనిపించదు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి అవసరమైన ఆహారాన్ని అందించేందుకు కొత్త తరహా సర్వీసులు హైదరాబాద్ మహానగరంలో మొదలయ్యాయి. ప్యాకేజీల్ని ఏర్పాటు చేసి.. వారికి నచ్చిన ఆహారాన్ని రెండు పూటలా అందిస్తున్నారు. ఇందుకు కొందరు హోటల్ యజమానులు.. కేటరింగ్ సర్వీసు వారు కొత్తతరహా వ్యాపారానికి తెర తీస్తున్నారు. దీని కారణంగా.. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి సౌకర్యవంతంగా మారుతోంది.
హైదరాబాద్ లో ఇలాంటి సర్వీసులు అందించే సంస్థలు పద్నాలుగు రోజుల ప్యాకేజీల్ని సిద్ధం చేశాయి. అందులో వెజ్.. నాన్ వెజ్ తో పాటు.. రోజుకు రెండు పూటలు.. రోజుకు మూడు పూటలు కూడా ఆహారాన్ని అందించే ఏర్పాట్లు చేస్తున్నాయి.వెజ్ మీల్ రెండుపూటలకుకలిసి మనిషికి రూ.3వేల నుంచి రూ.3500, అదే మూడు పూటలు అయితే.. 5500 నుంచి 6300 వరకు అందిస్తున్నారు. అదే నాన్ వెజ్ అయితే రోజు రెండు పూటకు కలిసి 4400 నుంచి 5500లకుఅందిస్తున్నారు.
అయితే.. ఈ సేవలన్ని కూడా హైదరాబాద్ మహానగరమంతా అందించటం లేదు. ఎక్కువగా మణికొండ.. మాదాపూర్..కొండాపూర్.. హైటెక్ సిటీ.. బంజారాహిల్స్.. గచ్చిబౌలి.. అమీర్ పేటలకు నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల పరిధిలో డోర్ డెలివరీ అందిస్తున్నారు. వెజ్ లో రోజు రెండు రకాల కూరలు.. పప్పు.. స్వీటు.. పులిహోరతో పాటు.. అన్నం.. అప్పడం.. పెరుగు ఇస్తున్నారు. అదే నాన్ వెజ్ లో అయితే.. చికెన్.. పప్పు.. సాంబార్.. పెరుగుతో పాటు.. స్వీటు అందిస్తున్నారు. అదే చికెన్ కాకుండా మటన్ కావాలంటే అదనంగా రూ.30 వసూలు చేస్తున్నారు.