పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్ శనివారం ఉదయం ఏడు గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైనా.. తర్వాత తర్వాత మాత్రం వేడెక్కింది. అధికార టీఎంసీ, బీజేపీ మధ్య నువ్వా-నేనా అనే విధంగా పోటీ నెలకొన్న బంగాల్లో ఎన్నికలు జరగనున్న 45 స్థానాల్లో ఉత్తర పరగణాలులో 16 స్థానాలు, తూర్పు వర్ధమాన్, నదియాలో 8, జాల్పాయ్గుడీలో ఏడు, డార్జీలింగ్లో ఐదు, కాలీంపాంగ్లో ఒక నియోజకవర్గానికి ఓటింగ్ జరగనుంది. వివిధ పార్టీల తరఫున పోటీలో ఉన్న 342 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని కోటీ 13లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు.
బరిలో కీలక నేతలు..
మంత్రి బ్రత్యబసు, బీజేపీ నేత సామిక్ భట్టాచార్య, సిలిగుడి మేయర్, లెఫ్ట్ నేత అశోక్ భట్టాచార్య తదితరులు ఈ విడతలో పోటీ చేస్తున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఈ 45 నియోజకవర్గాల్లో టీఎంసీ కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యం సాధించింది. అదే 2016 శాసనసభ ఎన్నికల్లో టీఎంసీ 32 సీట్లు గెలుపొందగా కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి 10స్థానాలు కైవసం చేసుకుంది. ఈ క్రమంలో మమతా బెనర్జీ ఈ ఐదో దశను ప్రతిష్టాత్మకంగా తీసుకుంన్నారు. ఇక, ఐదో విడత పోలింగ్ కోసం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది.
అత్యంత ప్రతిష్టాత్మకం..
కూచ్‌బిహార్ కాల్పుల ఘటన నేపథ్యంలో 48 గంటలకు బదులు 72 గంటల ముందుగానే ప్రచారాన్ని నిలిపి వేసింది. నాలుగో విడతలో రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఐదుగురు చనిపోవటంతో ఈసీ అప్రమత్తమైంది. పోలింగ్ జరిగే 45 నియోజకవర్గాల పరిధిలో రాష్ట్ర పోలీసులతోపాటు 853 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. బంగాల్లో ఇప్పటివరకు నాలుగు దశల్లో 135 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మరో 159 స్థానాలకు ఏప్రిల్ 17- 29 మధ్యలో పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు ప్రకటించనున్నారు.
మళ్లీ కాల్పులు.. హడలిపోయిన జనం
ఉత్తర 24 పరగణాలు జిల్లా దేగంగా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కురల్గచ్చా పోలింగ్ బూత్ వద్ద కేంద్రం బలగాలు శనివారం గాల్లోకి కాల్పులు జరిపాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఓటర్లు హడలి పోయారు. అసలు ఏం జరుగుతోందో తెలియలేదని ఓటర్లు పేర్కొనడం గమనార్హం. పోలింగ్ స్టేషన్ ముందు భారీగా గుమిగూడిన సమూహాన్ని చెదరగొట్టేందుకు ఈ చర్యకు పాల్పడ్డాయి. అంతకుముందు ఇక్కడ లాఠీ ఛార్జ్ కూడా జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని ఎన్నికల సంఘం జిల్లా అధికారులను ఆదేశించింది.