తెలంగాణలో బీమా వైద్య సేవల విభాగం(ఐఎంఎస్) కుంభకోణం పెను ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి అల్లుడు వేపా శ్రీనివాసరెడ్డికి…ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. కార్మిక శాఖ మంత్రిగా ఉన్న తన మామ నాయిని నర్సింహారెడ్డి హోదాను అడ్డు పెట్టుకుని శ్రీనివాస్ రెడ్డి ఐఎంఎస్ మందులు, కిట్ల కొనుగోళ్లలో చక్రం తిప్పినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించడం సంచలన రేపింది. శ్రీనివాసరెడ్డి ఇంట్లో రూ.1.50 కోట్ల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసరెడ్డితోపాటు నాయిని వద్ద గతంలో పనిచేసిన వారి ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
నాయిని కార్మికశాఖ మంత్రిగా ఉన్న సమయంలో.. ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ముకుంద రెడ్డి బావమరిది ఎం.వినయ్‌రెడ్డి ఇంట్లో రూ. 45 లక్షలు, టెలీహెల్త్ సర్వీసెస్ మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు బుర్రా ప్రమోద్‌రెడ్డి నుంచి రూ. 1.15 కోట్ల నగదును ఈడీ అధికారులు సీజ్ చేశారు. మొత్తం ఏడు చోట్ల ఏకకాలంలో జరిగిన తనిఖీల్లో రూ. 3.10 కోట్ల నగదుతో పాటు.. రూ. కోటి విలువ చేసే బంగారు ఆభరణాలు, బ్లాంక్ చెక్కులు, బ్యాంకు లాకర్ల పత్రాలు, విలువైన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.
ఐఎంఎస్ కుంభకోణం విలువ దాదాపు రూ.200 కోట్ల దాకా ఉంటుందని అంచనా. నకిలీ బిల్లులు, పత్రాలతో మందులు, మెడికల్ కిట్ల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఆమె భర్త, ఓమ్నిమెడి సంస్థ అధినేత శ్రీహరి బాబు అలియాస్ బాబ్జీతోపాటు మరికొందరిపై ఏసీబీ 8 కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.