సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు సినీ ఫక్కీలో మలుపులు తిరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కొద్ది రోజుల క్రితం సీబీఐ చార్జీషీటు దాఖలు చేయడం, అందులో వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలు ఇచ్చిన వాంగ్మూలాలు సంచలనం రేపడం తెలిసిందే. ఎంపీ అవినాష్ రెడ్డిపై, సజ్జలపై సునీత చేసిన కామెంట్లు కాక రేపాయి. అయితే, ఆ చార్జిషీట్ లో మాజీ ఐఏస్ అజేయ కల్లం స్టేట్మెంట్ కూడా ఉందని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తన వాంగ్మూలంపై అజేయ కల్లం షాకింగ్ కామెంట్లు చేశారు. ఆ చార్జిషీట్లో తాను చెప్పింది ఒకటని..సీబీఐ అధికారులు చెబుతోంది ఒకటని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన స్టేట్మెంట్ ను సీబీఐ మార్చిందని అన్నారు. 2023 ఏప్రిల్ 29న తన వాంగ్మూలాన్ని సీబీఐ రికార్డు చేసిందని గుర్తు చేశారు. వివేకా హత్య జరిగిన సమయంలో తాను జగన్ తో మీటింగ్ లో ఉన్నానని, ఆ సమయంలోనే జగన్ కు వివేకా మర్డర్ గురించి తెలిసిందని చెప్పారు. తన చిన్నాన్న చనిపోయాడని జగన షాక్ అవుతూ చెప్పారని గుర్తు చేసుకున్నారు.
15న జగన్ నివాసంలో సమావేశం జరుగుతుండగా అటెండర్ వచ్చి డోర్ కొట్టారని అజేయకల్లం చెప్పారు. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి జగన్ కు ఏదో చెప్పగానే ఆయన షాక్ కు గురై లేచి చిన్నాన్న చనిపోయారని చెప్పారని అన్నారు. ఆ విషయాన్ని తాను సీబీఐకి చెప్పానని, ఇంతకు మించి మరేమీ చెప్పలేదని తెలిపారు. జగన్ భార్య భారతి గురించి, మరే ఇతర విషయాల గుచించి తాను సీబీఐ విచారణలో వెల్లడించలేదని చెప్పారు. తాను చెప్పనివి కూడా సీబీఐ ఛార్జ్ షీట్ లో ఉన్నాయని, అవి అబద్ధాలని మండిపడ్డారు. దర్యాప్తును సీబీఐ తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. సీబీఐ పేర్కొన్న అంశాలను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.