ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను జగన్ హఠాత్తుగా బదిలీ చేయడంపై తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. హుటాహుటిన కొంపలు మునిగిపోతున్నట్లుగా అవమానకర రీతిలో సవాంగ్ ను జగన్ సాగనంపడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. సవాంగన్నా…అంటూనే ఆయనకు జగనన్న ఫిట్టింగ్ పెట్టారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
పైగా సవాంగ్ ను జీడీఏకు రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించిన జగన్ ఆయనకు ఏ పోస్టింగ్ ఇవ్వకపోవడంపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సవాంగ్ కు జగన్ ఏరికోరి మరీ అప్రాధాన్యత ఉన్న పోస్ట్ ను ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన ప్రతిపాదనలను గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రభుత్వం పంపింది.
గవర్నర్ ఆమోద ముద్ర పడిన తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న ఉదయ్‌భాస్కర్ పదవీ కాలం ఆరు నెలల క్రితం ముగియడంతో ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. ఈ పోస్ట్ ఇవ్వడంపై సవాంగ్ ఇంతవరకూ స్పందించలేదు. ఈ క్రమంలోనే జగన్ పై సోషల్ మీడియాలో జగన్ పై ట్రోలింగ్ జరుగుతోంది. ఉద్యోగాలివ్వని కమిషన్‌కు ఉద్యోగిగా సవాంగన్న నియమించావా జగనన్నా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని బల్లగుద్ది మరీ చెప్పిన జగనన్న…జాబ్ లెస్ క్యాలెండర్ ఇస్తున్నారని, ఇపుడు ఆ ఏపీపీఎస్సీకి సవాంగ్ ను నియమించి ఆయనను మరోసారి అవమానించారని కామెంట్లు చేస్తున్నారు.