ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో అధికారాన్ని కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీ రోజురోజుకు బలహీన పడుతోంది. కీలక నాయకులంతా అధికారం లేని చోట ఇమడలేక.. అధికార పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. మరోవైపు పార్టీకి ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు మినహా మిగతావారంతా పక్కచూపులు చూస్తున్నారు. ఇదే తరుణంలో జగన్ కు మరో తలనొప్పి మొదలైంది.
వాస్తవానికి కుమార్తె పుట్టినరోజు వేడుకల కోసం సెప్టెంబర్ 3న సతీసమేతంగా జగన్ లండన్ వెళ్లాలని భావించారు. సెప్టెంబర్ 25 వరకు లండన్ లోనే ఉండాలని భావించారు. సీబీఐ స్పెషల్ కోర్టు అందుకు అనుమతి కూడా ఇచ్చింది. కానీ ప్రస్తుతానికి ఆయన లండన్ ప్రయాణం క్యాన్సిల్ అయింది. సీఎం పదవి పోవడంతో జగన్ డిప్లోమాట్ పాస్‌పోర్టును రద్దు అయింది.
దాంతో చేసేదేమి లేక ఆయన జనరల్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టు నుంచి ఎన్వోసీని తేవాలని పాస్‌పోర్టు కార్యాలయం అధికారులు కోరారు. అందుకోసం విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపి కేవలం ఒక ఏడాది మాత్రమే పాస్‌పోర్ట్ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ అయింది.
అయితే జగన్ మాత్రం తనకు ఐదేళ్లకు పాస్ పోర్టు ఇవ్వాలని హైకోర్టులో నేడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. పాస్ పోర్ట్ కష్టాల వల్ల జగన్ తన లండన్ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.