హుజురాబాద్లో గెలుపే లక్యంగా టీఆర్ఎస్ ఓటర్లుకు అనేక హామీలు గుప్పించింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. ఉప ఎన్నికలో గెలిచి తీరాలని దళిత బంధు పథకాన్ని ప్రకటించింది. దళితుల ఓట్లను గంపగుత్తుగా సొంతం చేసుకోవాలని భావించింది. ఈ పథకాన్ని హుజురాబాద్ నుంచే ప్రారంభించారు. అయితే దళితబంధు పథకం ప్రారంభించిన శాలపల్లిలోనూ బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది.
కేసీఆర్ దళిత బంధు పథకం ప్రారంభించిన శాలపల్లిలో బీజేపీ 129 ఓట్ల ఆధిక్యతను సాధించింది. ఈ గ్రామంలో బీజేపీకి 311 ఓట్లు రాగా, టీఆర్ఎస్కు 182 ఓట్లు వచ్చాయి. శాలపల్లి ఓటర్లను టీఆర్ఎస్ ఆకర్షించలేకపోయింది. శాలపల్లి గ్రామంలోనే టీఆర్ఎస్కు ఆదరణ లేక పోవడం గమనార్హం.
హుజూరాబాద్ ఉప ఎన్నిక మొదటి రౌండ్ లో చెల్పూర్, వెంకట్రావు పల్లి, ఇందిరా నగర్, రాజపల్లి, సిరసపల్లితో పాటు శాలపల్లికి సంబంధించిన ఓట్లను కూడా లెక్కించారు. అయితే దళితబంధు ప్రకటించిన శాలపల్లిలోనే టీఆర్ఎస్కు తక్కువ ఓట్లు రావడంతో దళితబంధు లబ్దిదారులు షాకిచ్చారని చెబుతున్నారు. ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ వేసిన పాచిక పారలేదనే విశ్లేషకులు అంటున్నారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాలు ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. లెక్కల ప్రకారం హుజూరాబాద్ మండలంలో 5,323 దళిత కుటుంబాలు, కమలాపూర్ మండలంలో 4346, వీణవంకలో 3678 , జమ్మికుంటలో 4996 , ఇల్లందకుంట మండలంలో 2586 కుటుంబాలున్నాయి.
మొత్తంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాల నుంచి లబ్ధిదారులను దళిత బంధుకు ఎంపిక చేశామని అధికారులు చెబుతున్నారు. దళిబంధుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న గులాబీపార్టీకి మొదట్లోనే ఓటర్లు షాకిచ్చారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం హుజురాబాద్ లో దళిత బంధు పాచిక పారలేదని చెబుతున్నారు. మిగతా రౌండ్ లలో దళిత బంధు పథకం ఎలాంటి ప్రభావం చూపుతోందో వేచి చూడాలి.