అవును అలాగే ఉంది టీఆర్ఎస్ నాయకత్వం ఆలోచన. పార్టీకి బీసీ నేత, మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కేసీయార్ తో పొసగని కారణంగా ఈటల చాలా ఇబ్బందులు పడిన మాట వాస్తవం.
చివరకు అవమానకరంగా రాజేందర్ పార్టీకి రాజీనామా చేసి బయటకు రావాల్సొచ్చింది. టీఆర్ఎస్ కు సంబంధించి ఈటల ముగిసిన అధ్యాయం అయిపోయింది. ఇదే సమయంలో మరో బీసీ నేతను పార్టీలోకి రప్పించేందుకు వెంటనే ప్రయత్నాలు మొదలైపోయాయి.
ఈటల ప్లేసును మరో బీసీ నేత, మాజీమంత్రి ఎల్ రమణతో భర్తీ చేసేందుకు కేసీయార్ పావులు కదుపుతున్నారు. రమణ ప్రస్తుతం తెలంగాణా టీడీపీ అధ్యక్షుడన్న విషయం అందరికీ తెలిసిందే.
దాదాపు ఏడేళ్ళుగా తెలంగాణాకు రమణ అధ్యక్షునిగా ఉన్నారు. చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహిత నేతల్లో రమణ కూడా ఒకరు. అలాంటి బీసీ నేతను టీఆర్ఎస్ లో చేర్చుకుని ఎంఎల్సీని చేస్తామని ఆఫర్ ఇచ్చారట.
రమణకు బాగా సన్నిహితుడైన మంత్రి ఎర్రబల్లి దయాకర్ ద్వారా కేసీయార్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఎర్రబల్లి కూడా ఒకపుడు టీడీపీలో ప్రముఖునిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. టీఆర్ఎస్ నిష్క్రమణ తర్వాత కేసీయార్ బీసీలకు అన్యాయం చేస్తున్నారంటు ఈటల పదే పదే ఆరోపణలు చేస్తున్నారు.
అయితే ఈటల ఆరోపణలను మరో బీసీ నేత రమణను పార్టీలో చేర్చుకుని ఎంఎల్సీని చేయటం ద్వారా గట్టి సమాధానం చెప్పాలని కేసీయార్ ప్లాన్ చేస్తున్నట్లున్నారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే క్షేత్రస్ధాయిలో ఈటలకు, రమణకు బాగా తేడావుంది. అదేమిటంటే ఈటల వరుసగా నాలుగుసార్లుగా ఎంఎల్ఏగా గెలుస్తునే ఉన్నారు.
ఇదే సమయంలో రమణ రెండుసార్లు ఎంఎల్ఏగా ఒకసారి ఎంపిగా చేశారు. అయితే ఈటలతో పోల్చుకుంటే రమణ గట్టి నేతేమీకాదనే చెప్పాలి. కాకపోతే బీసీ నేతకు రీప్లేస్ మెంట్ గా మరో బీసీ నేతగా చెప్పుకోవటానికి పనికొస్తారంతే.