ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీలపై కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబానికి కూడా నెలకు దాదాపు వెయ్యి రూపాయల కరెంటు బిల్లు రావడంతో జనానికి షాక్ తగిలినట్లయింది. గతంలో ట్రూ ఆప్ ఛార్జీల వల్లే కరెంటు బిల్లులు పెరిగాయని చేతులు దులుపుకున్న జగన్ సర్కార్…ఆ తర్వాత వాటిని వెనక్కు తీసుకోవడంతో జనానికి కాస్త ఊరట లభించింది.
గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ బిల్లులలో ట్రూ ఆప్ చార్జీలను బిల్లులో వడ్డించారు. అయితే, ఈ వ్యవహారంపై న్యాయపరమైన చిక్కులు రావడంతో ఏపీఈఆర్సీ వెనక్కి తగ్గింది. దీంతో, గత ఏడాది నవంబరు నెల బిల్లులో ట్రూఅప్ ఛార్జీలను కలపలేదు. అంతేకాదు, ఆ రెండు నెలలకు వసూలు చేసిన ట్రూ అప్ చార్జీలను కూడా నవంబర్ నెల బిల్లు నుంచి వెనక్కి చెల్లిస్తూ సర్దుబాటు చేశారు.
అయితే, అలా తగ్గించడం అనేది తాత్కాలిక ఉపశమనమేనని, త్వరలోనే విద్యుత్ చార్జీలు పెంచాల్సిందేనంటూ ఈఆర్సీ ఆనాడే నిర్ణయం తీసుకుందని ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే ఏపీలో తాజాగా విద్యుత్ ఛార్జీల మోత మోగింది. విద్యుత్ చార్జీలు పెంచాలని ఈఆర్సీ తాజాగా నిర్ణయం తీసుకుంది. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఆగస్ట్ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఆల్రెడీ తెలంగాణలో పెంచిన విద్యుత్ చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే.
పెరిగిన విద్యుత్ చార్జీలు ఇవే:
30 యూనిట్ల వరకు 45 పైసలు
31 నుంచి 75 యూనిట్ల వరకు 91 పైసలు
76 నుంచి 125 యూనిట్ల వరకు రూ.1.40
126 నుంచి 225 యూనిట్ల వరకు రూ.1.57
226 నుంచి 400 యూనిట్ల వరకు రూ.1.16
400 యూనిట్లు దాటితే యూనిట్‌కు 55 పైసలు