టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎట్టకేలకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నారు. నిజానికి ఈ డీల్ ఎప్పుడో కుదిరి ఉండాలి. దీనికి సంబం ధించి కూడా ఆయన ప్రకటించి చాన్నాళ్లే అయింది. అయితే, అయితే అప్పటి నుంచి ఎదురు చూసినా మధ్య ఈ డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. కానీ, ఎందుకో ఏమో తాను మళ్లీ జోక్యం చేసుకుని ట్విట్టర్‌ను కొంటున్నట్టు ప్రకటించడం..దానిని సొంతం చేసుకోవడం గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. అయితే, ఆయన వచ్చీ రాగానే ట్విట్టర్ లో ఇప్పటి వరకు కీలక పొజిషన్లలోఉన్నవారికి షాకిచ్చారు.
వచ్చీ రాగానే టాప్ ఎగ్జిక్యూటివ్‌లను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించి భారీ షాక్ ఇచ్చారు. ఈ మేరకు యూఎస్ మీడియా గత అర్ధరాత్రి దాటాక పేర్కొంది. ఈ డీల్‌తో ప్రపంచంలోనే అతి పెద్దదైన సోషల్ మీడియా చర్చా వేదిక మస్క్ చేతికి చిక్కినట్టు అయింది. ట్విట్టర్ కొనుగోలు విషయంలో ఈ నెల 28 లోపు ఏదో ఒక నిర్ణయానికి రావాలంటూ కోర్టు తుది గడువు విధించిన నేపథ్యంలో ట్విట్టర్‌ను మస్క్ సొంతం చేసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తంగా 44 బిలియన్ డాలర్లకు ఈ డీల్ కుదిరింది.
ట్విట్టర్ తన చేతికి వచ్చిన వెంటనే సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దె, ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్ సీన్ హెడ్గెట్‌లపై మస్క్ వేటేసినట్టు ‘వాషింగ్టన్ పోస్ట్’, ‘సీఎన్‌బీసీ’ పేర్కొన్నాయి. ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ముందు మస్క్ ఆసక్తిక ట్వీట్ చేశారు. నాగరికత భవిష్యత్‌కు ఉమ్మడి డిజిటల్ టౌన్ స్క్వేర్ను కలిగి ఉండడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఇక్కడ పలు రకాల నమ్మకాలను ఆరోగ్యకరమైన రీతిలో చర్చించవచ్చని అన్నారు. దీంతో మస్క్‌పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ నాయకుల నుంచి దేశాధినేతల వరకు నేడు ట్విట్టర్‌ను ప్రధాన మాధ్యమంగా వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్విట్టర్‌పై మస్క్ తీసుకునే నిర్ణయాలు.. ఆయన చర్యలు ప్రపంచదేశాల్లోనూ చర్చనీయాంశం అయ్యాయి. మరి ఇవి మున్ముందు మరింత గా ఈ సోషల్ మీడియా వేదికను నూతన పరుస్తాయో..లేక మస్క్ వ్యాపార సంస్థల్లా నష్టాల్లోకి తీసుకువెళ్తాయో చూడాలి. ప్రస్తుతం ఆయన ప్రవేశ పెట్టి జోడో కాయిన్ తీవ్ర నష్టాల్లో ఉండడం గమనార్హం.