ఈ మధ్య కాలంలో వచ్చిన అత్యంత భారీ సినిమానే కాదు.. అత్యంత హైప్ తెచ్చుకున్న సినిమా కూడా ‘ఆదిపురుష్’యే. అంతే కాక రిలీజ్ తర్వాత విపరీతమైన డివైడ్ టాక్ తెచ్చుకున్న చిత్రం కూడా ఇదే. ఐతే తొలి వీకెండ్లో ఆ టాక్ సినిమా మీద పెద్దగా ప్రభావం చూపనట్లే కనిపించింది. తొలి రోజు రికార్డు స్థాయిలో రూ.140 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఔరా అనిపించిందీ సినిమా. శనివారం వసూళ్లు కొంచెం డ్రాప్ అయినా.. అది ప్రతి సినిమాకూ ఉండేదే.
ఆ రోజుతో పోలిస్తే ఆదివారం వసూళ్లు కొంచెం పెరిగాయి. దీంతో నెగెటివ్ టాక్ వల్ల సినిమాకు నష్టమే లేదని రిలాక్స్ అయ్యారు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు. కానీ ఆ టాక్ దెబ్బ ఏంటో సోమవారం అందరికీ తెలిసి వచ్చింది. సోమవారం నాటి అగ్నిపరీక్షను ‘ఆదిపురుష్’ అధిగమించలేకపోయింది. హిందీ, తెలుగు అని తేడా లేకుండా అన్ని వెర్షన్ల వసూళ్లూ ఒక్కసారిగా బాగా పడిపోయాయి.
‘ఆదిపురుష్’ తెలుగు వెర్షన్‌కు ఒక్క హైదరాబాద్ సిటీలో మాత్రమే మంచి ఆక్యుపెన్సీలు కనిపించాయి. అది కూడా ఫస్ట్, సెకండ్ షోలకు మాత్రమే. మార్నింగ్ షోలు, మ్యాట్నీలకు హైదరాబాద్‌లో కూడా సరైన స్పందన లేదు. ఇక మిగతా అన్ని ఏరియాల్లోనూ రోజంతా థియేటర్లు వెలవెలబోయాయి. ఆదివారంతో పోలిస్తే వసూళ్లు సగం కూడా రాలేదు. 75 శాతం దాకా డ్రాప్ కనిపించింది. వీకెండ్లో తెలుగు వెర్షన్‌ను మించి బాగా ఆడిన హిందీ వెర్షన్ కూడా సోమవారం చతికిలపడింది.
నార్త్ ఇండియాలో వసూళ్లు ముందు రోజుతో పోలిస్తే 70-్ర80 శాతం మధ్య డ్రాప్ అయ్యాయి. సినిమాకు వస్తున్న వసూళ్లు కూడా త్రీడీ వెర్షన్ల నుంచి వస్తున్నవే. 2డీ వెర్షన్లకు అయితే మినిమం ఆక్యుపెన్సీ లేదు. నాన్-త్రీడీ వెర్షన్ చూడటానికి జనాలు కనీస ఆసక్తిని ప్రదర్శించడం లేదు. చూస్తుంటే వీక్ డేస్‌లో ‘ఆదిపురుష్’ చెప్పుకోదగ్గ షేర్ ఏమీ తెచ్చేలా లేదు. ఇంకా రూ.150 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేస్తే తప్ప బ్రేక్ ఈవెన్ అవ్వని ఈ చిత్రం.. బయ్యర్లను నష్టాలు పాలు చేసేలాగే ఉంది.