వీఎన్ ఆదిత్య గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఉదయ్ కిరణ్ మరియు రీమ్మా సేన్ జంటగా నటించిన ఫ్యామిలీ డ్రామా `మనసంతా నువ్వే` మూవీతో దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన వీఎన్ ఆదిత్య.. తొలి ప్రయత్నంలో తనదైన మార్క్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత శ్రీరామ్, నేనున్నాను, మనసు మాట వినదు, బాస్, ఆట, ఇంద్రధనస్సు, రాజ్ వంటి అనేక చిత్రాలకు దర్శకత్వం వహించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.
ప్రస్తుతం వీఎన్ ఆదిత్య డైరెక్ట్ చేసిన కొన్ని చిత్రాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇంతలోనే ఓ క్రేజీ అప్డేట్ తెరపైకి వచ్చింది. ఫీల్ గుడ్ మూవీస్‌కు కెరాఫ్ అడ్రెస్ అయిన వీఎన్ ఆదిత్య త్వరలోనే మరో కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. అది కూడా ఇక్కడ కాదండోయ్.. అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో. ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ మేరకు జూలై 7 ఆదివారం నాడు డల్లాస్ లోని లాకింట బంకేట్ హాల్లో నిర్మహించిన మీడియా సమావేశంలో కొత్త సినిమాపై ప్రకటన చేశారు.
వీఎన్ ఆదిత్య డైరెక్ట్ చేయబోయే ఈ సినిమా మరికొద్ది రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. సినిమా నిర్మాణం డల్లాస్ లోనే జరగనుంది. ఇకపోతే తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్ ఈ మూవీకి సంబంధించి ఆడిషన్స్ నిర్వహించగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రవాస భారతీయులు మాత్రమే కాకుండా అమెరికన్స్, ఆఫ్రికన్స్, స్పానిష్ పీపుల్, యూరోపియన్స్, ఏషియన్స్ తో పాటు ఇండియన్స్.. మరీ ముఖ్యంగా తెలుగు, కన్నడ, తమిళ్ వారు భారీ సంఖ్యలో ఆడిషన్స్ లో పాల్గొన్నారు. దేశం కాని దేశంలో ఓ తెలుగు సినిమా ఆడిషన్ కి ఇంతటి రెస్పాండ్ రావడంతో చిత్ర బృందం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇక మరి వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతున్న ఈ కొత్త సినిమా ఎలాంటి కథతో ప్రేక్షకులకు ముందుకి వస్తుందో తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే.