సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి వీడియో మార్ఫింగ్ కు పాల్పడ్డాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేవినేని ఉమను సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. సీఐడీ కార్యాలయంలో దాదాపు 9 గంటల పాటు ఉమను రెండో రోజు కూడా విచారణ జరిపారు. తదుపరి విచారణ కోసం ఈ నెల 4వ తేదీన హాజరు కావాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో సీఐడీ విచారణలో అంశాలు వెలుగులోకి రావడంపై ఉమ మండిపడ్డారు. గోప్యంగా ఉండాల్సిన విచారణలోని అంశాలు బయటికి ఎలా వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, ఈ వ్యవహారంపై తాను హైకోర్టులో పిటిషన్ వేస్తానని కూడా ఉమ వెల్లడించారు. విచారణ జరుగుతున్న సమయంలో విజయసాయిరెడ్డి ఎలా ట్వీట్ చేస్తారని ఉమ నిలదీశారు.
విజయసాయిరెడ్డి ఒక పెద్ద దొంగ అని, తనను సీఐడీ ముందు 9 గంటలు కూర్చోబెట్టే బదులు విజయసాయిరెడ్డిని కూర్చోబెడితే హూ కిల్డ్ బాబాయ్ ప్రశ్నకు సమాధానం దొరికేదని ఎద్దేవా చేశారు. రాజకీయ కక్షతోనే తనపై దుర్మార్గంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఉమ ఆరోపించారు. టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతోన్న పోలీసులను వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆ పోలీసులను ఒడిశా, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాలకు పంపిస్తామని హెచ్చరించారు.