ఇపుడు బయటపడిన తెలంగాణ అప్పులతో జనాలు షాక్ కు గురవుతున్నారా ? వెలుగుచూసిన గణాంకాలతో అందరు షాక్ తింటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే గడచిన పదేళ్ళ కేసీయార్ పాలనలో పెరిగిన అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదలచేసింది. ప్రభుత్వం లెక్కలు అందులోను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) సర్టిఫైడ్ రిపోర్టు ప్రకారం ఈ అప్పులన్నింటినీ నిజమనే అనుకోవాలి. దాంతో బయటపడిన అప్పుల లెక్కలతో నిపుణులతో పాటు మామూలు జనాలు కూడా నోరెళ్ళపెడుతున్నారు.
తాజాగా బయటపడిన లెక్కల ప్రకారం తెలంగాణా మొత్తం అప్పులు రు. 6,71, 757 కోట్లు. తెలంగాణా ఏర్పడేనాటికి అంటే 2014 సమయానికి బడ్జెట్ అప్పులు, ఆఫ్ బడ్జెట్ అప్పులు అంటే కార్పొరేషన్ల అప్పులతో కలిపి ఉన్న అప్పులు రు. 72,568 కోట్లు మాత్రమే. రాష్ట్ర ఆదాయంలో 34 శాతం అప్పులకు కట్టాల్సిన వడ్దీలకే సరిపోతోంది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు చెల్లిస్తున్నది 35 శాతంగా తేలింది. అంటే రాష్ట్ర రెవిన్యులో అప్పులకు చెల్లిస్తున్న వడ్డీలు, ఉద్యోగుల జీత, బత్యాలు, పెన్షన్లకే సుమారు 70 శాతం సరిపోతోంది. అందుకనే విద్య, వైద్యానికి కేసీయార్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు పెద్దగాలేదు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణా ఆప్పులపై చాలాకాలంగా కాంగ్రెస్ నేతలు పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఎవరికీ వాస్తవ అప్పులెంతో తెలీదు. ఎందుకంటే కేసీయార్ ప్రభుత్వం అప్పులగురించి ఎప్పుడూ మాట్లాడిందిలేదు. ఇదే సమయంలో కేంద్రప్రభుత్వం కూడా తెలంగాణా అప్పులపై ప్రకటనేమీ చేయలేదు. పోనీ మీడియా ఏమన్నా సొంతంగా కథనాలు ఇచ్చిందా అంటే అదీలేదు.
కాబట్టి తెలంగాణా వాస్తవ అప్పులు ఎంతన్న విషయం ఎవరికీ తెలీదు. ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బయటపడిన అప్పులతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఈ అప్పుల మొత్తంలో ఆర్బీఐ నుండి తీసుకున్న అప్పులే రు. 3,89, 673 కోట్లున్నాయి. కార్పొరేషన్లు చేసిన అప్పులు రు. 1,27,208 కోట్లు. ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్లు చేసిన అప్పులు రు. 95,462 కోట్లు. తాజాగా బయటపడిన అప్పులతో మిగిలిన రాష్ట్రాలతో అప్పుల్లో తెలంగాణా స్ధానమేంటో తెలియాలి.