అది దేశ రాజధాని ఢిల్లీ నగరం. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. అయితేనేం.. కొందరు యువకులు హెల్మెట్లు పెట్టుకుని నాలుగు బైకులపై వచ్చారు. పోతూపోతూ ఉన్నకారును అడ్డగించారు. తుపాకులు తీశారు. ఆ కారు అద్దాలను బలంగా లాగారు. కారులో ఉన్న లక్షల రూపాయల నగదు మూటను ఎత్తుకుపోయారు. ఈ పరిణామం.. ఎలా ఉన్నా.. పొలిటికల్‌గా ఇది ప్రధాని నరేంద్ర మోడీకి భారీషాక్ ఇస్తోంది.
ఏం జరిగిందంటే..
ఢిల్లీలోని ప్రగతి మైదాన్ టన్నెల్… భారీ రద్దీగా ఉండే ప్రాంతం. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వస్తూ పోతూ ఉండే వాహనాలతో టన్నెల్ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. అలాంటి టన్నెల్‌పై శనివారం ఉదయం 12 గంటల సమయంలో కారులో వెళ్తున్న బంగారు ఆభరణాల వ్యాపారి, అతడి సహచరుడిని ఆపిన దొంగల ముఠా వారి వద్ద నుంచి 2 లక్షల రూపాయలను నగదును దోచుకెళ్లారు.
4 బైకులతో వెంబడించి.. రోడ్డుపై వెళ్తున్న కారును అడ్డగించి తుపాకులు చూపించి నగదు బ్యాగును ఎత్తుకెళ్లారు. ఈ నెల 24వ తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మోడీ కేంద్రంగా..
ప్రస్తుతం దేశరాజధానిలో శాంతి భద్రతల విషయంపై రాజకీయం ముసురుకున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో శ్రద్ధా దాస్ సహా.. ఈ నెలలోనే ఒక యువతిని ప్రేమికుడు 35 సార్లు పొడిచి… బండతో మోది చంపడం సంచలనంగా మారింది. ఇలాంటి ఘటనలకు తోడు ఇప్పుడు దోపిడీ ఘటన సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం కేజ్రీవాల్ ప్రధాని మోడీని నిలదీశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో శాంతి భద్రతలు లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉండడాన్ని ఆయన ప్రశ్నించారు.
ఢిల్లీ ప్రజలను దొంగలకు, హంతకులకు వదిలేస్తారా? అంటూ కేజ్రీవాల్ నిలదీశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. “డిల్లీని పూర్తి సురక్షిత ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం మార్చలేకపోతోంది. లా అండ్ ఆర్డర్‌ను మాకు అప్పగించండి. ఢిల్లీ ప్రజలకు మేము భద్రత కల్పిస్తాం” అని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.