ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. కరోనా ఫస్ట్ వేవ్ నుంచి కోలుకున్న ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకునే లోపే సెకండ్ వేవ్ రూపంలో ఈ మాయదారి వైరస్ మరింత ఉధృతంగా విరుచుకుపడింది. ఇక, సెకండ్ వేవ్ ముప్పు నుంచి తేరుకునే లోపు పిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం మొదలైందని తాజా నమోదవుతున్న గణాంకాలు చెబుతున్నాయి.ఇతర దేశాలతో పిల్లల్లోనూ కరోనా కేసులు పెరుగుతుండగా…తాజాగా బెంగుళూరులో దాదాపు 300 మంది పిల్లలకు కరోనా వైరస్ సోకడంతో తల్లిదండ్రుల్లో కలవరం మొదలైంది.
ఈ నేపథ్యంలోనే పిల్లల్లో కరోనా ప్రభావంపై ఓ తాజా అధ్యయనం తీపి కబురు చెప్పింది. రాబోయే రోజుల్లో కరోనా ప్రభావం తగ్గిపోతుందని, చిన్న పిల్లల్లో వచ్చే సాధారణ జలుబులా అది మారిపోతుందని అమెరికా, నార్వే సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. అయితే, వ్యాక్సిన్ తీసుకోని చిన్నారులపైనే కోవిడ్-19 ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆ సర్వే తెలిపింది. ఇప్పటిదాకా పిల్లల్లో కరోనా ప్రభావం స్వల్పంగా ఉందని, వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఈ వైరస్ ముప్పు పెద్దలకి కూడా తప్పిపోతుందని అంచనా వేసింది.
పెద్దలందరికీ వైరస్ సోకడం లేదా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల యాంటీబాడీలు వచ్చి వైరస్ తీవ్రత బాగా తగ్గిపోతుందని వెల్లడించింది. 1889–1890లో పెచ్చరిల్లిన రష్యన్ ఫ్లూ దాదాపు 10 లక్షల మందిని పొట్టన పెట్టుకుందని, ఇప్పుడా వైరస్ 7–12 నెలల పిల్లలకి వచ్చే సాధారణ జలుబులా మారిందని పరిశోధకులు చెబుతున్నారు. కరోనా వైరస్ సోకిన వారిలో కన్నా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎక్కువగా యాంటీ బాడీలు వచ్చాయని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.