గత ఏడాది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల-టీటీడీకి సంబంధించిన వ్యవహారాల్లో తరచుగా ఏదో ఒక వివాదం తలెత్తుతున్న సంగతి తెలిసిందే. శ్రీవారి భూముల్ని వేలం వేయడానికి టీటీడీ సిద్ధపడటంపై ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. అలాగే ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్గా నియమితుడైన పృథ్వీ ఓ మహిళతో ఫోన్లో అసభ్యంగా మాట్లాడిన ఆడియో బయటికి వచ్చి పదవి నుంచి తప్పుకోవడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. మరోవైపు అన్య మతస్థుడైన సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా శ్రీవారిని దర్శించుకోవడమూ వివివాదాస్పదమైంది.
ఇవన్నీ కాకుండా తిరుమలలో అన్యమత ప్రచారం మునుపెన్నడూ లేని విధంగా పెరిగిపోవడం పలుమార్లు చర్చనీయాంశమైంది. టీటీడీ వెబ్ సైట్లో క్రిస్టియానిటీని ప్రోత్సహించేలా కొన్ని లింకులు కనిపించడం.. శ్రీవారి కీర్తనల్లో లేని వాక్యాల్ని చేర్చడం లాంటి వివాదాలు మనోభావాలను దెబ్బ తీశాయి. ఇప్పుడు తిరుమలతో భక్తుల మనోభావాల్ని గాయపరిచే మరో పరిణామం చోటు చేసుకుంది.
శ్రీవారి ఆలయానికి ముస్తాబు చేసిన లైట్లను శిలువ ఆకారంలో రూపొందించడం వివాదాస్పదమైంది. సదరు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీటీడీ తీరును నెటిజన్లు తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. ఉద్దేశపూర్వకంగా ఇలాంటివి చేస్తున్నారని.. ఇదంతా క్రిస్టియానిటీని వ్యాప్తి చేయడానికి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రే అని ఆరోపించారు. విషయం తీవ్రత అర్థం చేసుకున్న టీటీడీ అధికారులు ఆ లైట్లను తొలగించారు.
పూర్ణ కుంభం ఆకారంలో ఆ లైట్లను తయారు చేయించామని.. కానీ భక్తులు తప్పుగా అర్థం చేసుకున్నారని అధికారులు సమర్థించుకున్నారు కానీ.. ఆ లైట్లను చూస్తే మాత్రం అలా ఏమీ అనిపించడం లేదు. పూర్ణ కుంభం కంటే శిలువ ఆకారానికే అవి దగ్గరగా ఉన్నాయి. మరోవైపు టీటీడీ ఉద్యోగుల్లో దాదాపు పది మంది దాకా అన్య మతస్థులు ఉన్నారన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టలేదన్న విమర్శలూ ఉన్నాయి.