నెల్లూరుకు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నాయకుల మధ్య ఆనందయ్య కరోనా మందు విషయంలో వివాదం ఏర్పడింది. నువ్వా-నేనా అన్నట్టుగా నాయకులు పోటా పోటీగా మందును పంపిణీ చేస్తున్నారు. వీరిలో ఒకరు ఒంగోలు ఎమ్మెల్యే కమ్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కాగా, మరొకరు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కావడం గమనార్హం. వాస్తవానికి వీరిద్దరి మధ్య ఆది నుంచి సఖ్యతలేని విషయం తెలిసిందే. రాజకీయంగా మాగుంట వైసీపీలోకి రావడాన్ని బాలినేని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే.. రాజకీయ అవసరాల నేపథ్యంలో జగన్.. మాగుంటను పార్టీలోకి చేర్చుకుని ఏకంగా ఒంగోలు ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు.
అయితే.. గత ఎన్నికల్లో గెలిచినా.. మాగుంట పెద్దగా దూకుడు చూపించలేక పోతున్నారు. వాస్తవానికి గతం లో కాంగ్రెస్‌లో ఉన్నా.. కొన్నాళ్లు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నా.. మాగుంట తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. తన వారికి పనులు చేయించే దగ్గర నుంచి నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకొనే వరకు మాగుంటకు తిరుగులేదనే వాదన ఉండేది. అయితే.. వైసీపీలోకి వచ్చాక ఆయన వాయిస్ సహా పనులు కూడా చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి బాలినేని ప్రధాన కారణమనే చర్చ రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ ఉంది.
అయితే.. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఇప్పుడు ఆనందయ్య కరోనా మందు పంపిణీ విషయంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని, దూకుడుగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల కిందట నేరుగా ఆనందయ్యను కలిసి ఆయనను ఘనంగా సన్మానించి.. నేనున్నాను.. మీరు ముందుకు దూసుకుపోండి అని హామీ ఇచ్చారు. ఇక, ఈ క్రమంలో మంత్రి బాలినేని కూడా పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
దీంతో ఆనందయ్య మందు పంపిణీ.. మరోసారి అటు ఎంపీకి, ఇటు మంత్రికి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పుడు ఆనందయ్య మందు తయారై.. పంపిణీ విషయానికి వచ్చే సరికి ఇరువురు నేతలు.. కూడా ప్రత్యేకంగా శిబిరాలు పెట్టుకుని మందు పంపిణీ ప్రారంబించారు. మాగుంట స్థానికంగా ఉన్న ఓ స్కూల్‌ను ఎంచుకుని శిబిరం ఏర్పాటు చేసి.. మందు పంపిణీకి శ్రీకారం చుట్టగా.. బాలినేని ఏకంగా పార్టీ ఆఫీస్‌నే మందు పంపిణీకి కేంద్రంగా మార్చేశారు.
దీంతో నెల్లూరులో ఆనందయ్య మందు పంపిణీకి రెండు కేంద్రాలు ఏర్పడి.. పార్టీ నేతలు రెండుగా చీలిపోయి పంపిణీని చేస్తుండడంతో రాజకీయంగా దుమారం రేగింది. ఆధార్ ఆధారంగా బాలినేని వర్గం మందును పంపిణీ చేస్తుంటే.. మాగుంట మాత్రం కార్పొరేటర్ల నుంచి స్లిప్పులు తెచ్చిన వారికి మందును ఇస్తున్నారు. నిజానికి మందు తయారీ, పంపిణీల విషయంలో రాజకీయ జోక్యం వద్దని హైకోర్టు చెప్పినా.. ఇద్దరు నేతలు మాత్రం ఇలా విడిపోయి మందును పంపిణీ చేయడాన్ని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై కోర్టుకు కూడా వెళ్తామని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.