తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నీటి పారుదలప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్ర రైతాంగానికి మరణ శాసనం రాశారని దుయ్యబట్టారు. జూరాల ప్రాజెక్టు ద్వారా రావాల్సిన నీటిని కూడా రాకుండా చేశారని చెప్పారు.
కాళేశ్వరం కట్టుడు.. లక్ష కోట్లకు ముంచుడు రెండూ కూడా అయిపోయాయని సీఎం చెప్పారు. లంచాలు, కమీషన్ల కోసం.. ఎస్ఎల్ బీసీని పక్కన పెట్టారని, దీంతో 20 కిలో మీటర్లు నిర్మిస్తే.. అయిపోయే ప్రాజెక్టు ఇప్పటికీ అలానే ఉందన్నారు. కేసీఆర్ హయాంలో ఏపీ సీఎం జగన్ను ఇంటికి పిలిచి పంక్ష భక్ష పరమాన్నాలు పెట్టి మరీ.. రాయలసీమ ఎత్తి పోతల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టా రు. కేంద్రంతోనూ.. లాలూచి పడి ప్రాజెక్టులను పండబెట్టారని అన్నారు.
ఇలాంటి కేసీఆర్ ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శించారు. తాను అన్ని ప్రాజెక్టుల పైన పక్కా లెక్కలతోనే మాట్లాడుతున్నానని రేవంత్ వ్యాఖ్యానించారు. దమ్ముంటే.. కేసీఆర్ సభకు వచ్చి.. కాదని నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రజల సొమ్మును 54 లక్షల రూపాయల మేరకు జీతంగా భత్యంగా తీసుకుంటున్న కేసీఆర్.. సభకు వచ్చింది కేవలం రెండు సార్లేనని.. ఇలాంటి వారికి అసలు జీతం ఎందుకు ఇవ్వాలని.. ప్రశ్నించారు.
“సభ అంటే గౌరవం లేదు. ప్రజలంటే గౌరవం లేదు. ప్రాజెక్టుల్లో కమీషన్లు కొట్టేసి.. పండబెట్టారు. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో లాలూచీ రాజకీయాలు చేసి.. తెలంగాణ రైతులకు మరణ శాసనం రాశారు. నల్లగొండలో ఫ్లోరైడ్ బాధితులను కనీసం పదేళ్ల లో ఒక్కసారి కూడా పరామర్శించలేదు. అక్కడి రైతాంగం ఫ్లోరైడ్ కారణంగా అలో లక్ష్మణా అని ఏడుస్తున్నా.. ఫామ్ హౌస్ నుంచి కదలిరాలేదు. వీరా రైతుల గురించి మాట్లాడేది“ అని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.
కేసీఆర్ దగ్గర ఏముంది?
కేసీఆర్ దగ్గర ఏముందని తాను తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయనకు ఉన్న ఒక్క సీటును 2023లో ప్రజలు గుంజుకుని.. కాంగ్రెస్ పార్టీకి అప్పగించారని.. ఇప్పుడు తీసుకునేందుకు కేసీఆర్ దగ్గర ఏముందని వ్యాఖ్యానించారు. తాను బీఆర్ఎస్ పార్టీ మార్చురీలో ఉందని అన్నానని, కానీ. కేటీఆర్, హరీష్ రావులు.. తాను కేసీఆర్ ను అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇది సరైన విధానం కాదన్నారు. ప్రతిపక్షంగా మరో వందేళ్లు కేసీఆర్ బాగుండాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు.