ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల ప్రైవేట్ మద్యం షాపులు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. రెండేళ్ల కాలపరిమితితో నూతన మద్యం విధానాన్ని కూటమి సర్కార్ అందుబాటులోకి తెచ్చింది. అలాగే 2019కి ముందున్న మద్యం బ్రాండ్లను తిరిగి తీసుకురావడంతో మందుబాబుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా మద్యం ధరలు, ఇసుక లభ్యత, సరఫరాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆ సందర్భంగా తప్పు చేస్తే తాట తీస్తానంటూ మద్యం షాపుల ఓనర్స్ కు చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎవ్వరైనా మద్యం షాపుల్లో ఎంఆర్పీ ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ ఛార్జ్ చేసినా సహించవద్దని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. ఎంఆర్పీకి మించి మద్యం అమ్మకాలు జరిపినట్లు రుజువైతే మొదటి తప్పు కింద రూ.5 లక్షల జరిమానా విధించాలని, ఒకవేళ మళ్లీ అదే తప్పును రిపీట్ చేస్తే షాపు లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని చంద్రబాబు సూచించారు.
అలాగే బెల్ట్ షాపులను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించవద్దని.. మద్యం షాపుల యజమానులు ఎవరైనా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని చంద్రబాబు అన్నారు. బెల్ట్ షాపులకు సపోర్ట్ చేస్తే.. మొదటి సారి తప్పు కింద్ర రూ. 5 లక్షలు ఫైన్, మళ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి లైసెన్స్ రద్దు చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఇక ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని మరియు ప్రతి మద్యం షాపుకు సిసి కెమేరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు.