జనాభా నియంత్రణ కోసం ఒకప్పుడు ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు అనేవారు. ఉద్యోగాలు, పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా మంది దంపతలు కూడా ఒక బిడ్డని కనగానే చాలు అనుకుంటున్నారు. కొందరైతే పిల్లల్లే వద్దనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనాభా నియంత్రణ వద్దు అంటున్నారు. ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ ఆడబిడ్డలకు బాబు పిలుపునిచ్చారు. లేదంటే భవిష్యత్తులో పెను ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.
రాజధాని నిర్మాణ పనుల ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన చంద్రబాబు..జనాభా పెరుగుదల ఆవశ్యకతపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా పెరుగుదల ఆగిపోయిందని.. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్నేళ్ల తర్వాత జనాభా దారుణంగా పడిపోతుందని చంద్రబాబు అన్నారు. దేశంలో వృద్ధ జనాభా పెరిగి, యువత శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. 2047 కల్లా వృద్ధ భారతంగా మారనుందని.. అందుకే రాష్ట్రంలో జనాభాను పెంచాలని పిలుపునిస్తున్నానని తెలిపారు.
దేశ హితం, సమాజాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆడపడుచులు జనాభా పెరుగుదలకు కృషి చేయాలని.. కనీసం ఇద్దరు పిల్లలకు జన్మనివ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ఇక భవిష్యత్తులో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులు అయ్యే విధంగా కొత్త చట్టం తీసుకువస్తున్నామంటూ చంద్రబాబు ఈ సందర్భంగా సరదా వ్యఖ్యలు చేశారు.