తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం గ్రామంలోని రామాలయంలో క్రైస్తవ కూటం ఏర్పాటు చేసి ప్రార్థనలు నిర్వహించారని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. రాముల వారి గుడి ముందు ఓ పాస్టర్ తో పాటు కొందరు క్రిస్టియన్లు ప్రేయర్లు నిర్వహిస్తున్న వీడియో పెను దుమారం రేపింది. రామాలయం ముందు క్రైస్తవ ప్రార్థనలు జరుగుతుండగా స్థానిక వ్యక్తులు కొందరు అడ్డుకున్నట్లుగా ఆ వీడియోలో కనిపించింది.
రామాలయం ముందు క్రైస్తవ ప్రార్థనలు ఏంటని ఆ వ్యక్తి ప్రశ్నించగా…మిగతా వారు అతడితో వాగ్వాదానికి దిగడం కనిపిస్తుంది. అయితే, తాము రామాలయానికి ఆనుకుని ఉన్న ఇంటి దగ్గర క్రైస్తవ కూటం ఏర్పాటు చేసుకున్నామని, రామాలయం దగ్గర కాదని క్రైస్తవుల వర్గం చెబుతున్నట్లు కనిపిస్తోంది. రామాలయం దగ్గర ప్రార్థనలు వద్దంటే తమపై దిశ యాప్ లో తప్పుడు ఫిర్యాదులు చేసి కేసులు పెట్టారని స్థానిక వ్యక్తి ఒకరు ఆరోపిస్తున్నారు.
ఇక, ఈ తతంగానికి సంబంధించిన వీడియోను బీజేపీ ఏపీ ఇంఛార్జ్ సునీల్ ధియోధర్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో ఆ వ్యవహారం జాతీయ స్థాయిలో వైరల్ అయింది. ఏపీలో సీఎం జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత క్రిస్టియానిటీ పెరిగిందని తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వీడియో…ప్రాధాన్యతను సంతరించుకుంది. జగన్ మతమార్పిళ్లకు ఇది పరాకాష్ట అని, రాముడి మందిరాన్ని ఆక్రమించుకొని క్రిస్టియన్ ప్రార్థనలు చేయడం ఏమిటని ధియోధర్ మండిపడ్డారు. #RamInsultedInAp అనే హ్యాష్ ట్యాగ్ ను ధియోధర్ ట్యాగ్ చేయడంతో అది ట్రెండ్ అవుతోంది. దీంతో, ధియోధర్ ట్వీట్ ను షేర్ చేసిన వైసీపీ మాజీ ఎంపీ, బీజేపీ నేత కొత్తపల్లి గీత, పలువురు బీజేపీ నేతలు కూడా ఆ ప్రార్థనలపై మండిపడ్డారు.
అయితే, ఈ వ్యవహారంపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు క్లారిటీ ఇచ్చారు. గంగవరం గ్రామంలో “కాదా మంగాయమ్మ” అనే మహిళ గత కొన్ని సంవత్సరాల నుంచి తన ఇంటి ముందు ఉన్న రోడ్డు మీద ప్రార్ధనలు నిర్వహిస్తున్నారని, అదే రోడ్డుకి ఆనుకుని ఉన్న రామాలయంలో నిత్యం పూజలు జరుగుతుంటాయని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎమ్.రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. ఈ విషయంలో స్థానిక హిందువులకు, క్రైస్తవులకు ఎటువంటి అభ్యంతరం లేదని చెబుతున్నారు.
అయితే, ఇటీవల మంగాయమ్మకు, కాకినాడలో ఉంటున్న ఆమె పెద్ద కుమారుడైన కాదా శ్రీనివాస్ తో ఆర్ధిక వివాదాలు వచ్చాయని, తన తల్లి ప్రార్థనల పేరుతో డబ్బు వృధా చేస్తుందని ఆమెతో అతడు ఘర్షణ పడుతున్నాడని చెప్పారు. ఈ విషయంలో మంగాయమ్మ, మరికొందరు డయల్ 100 కు ఫోన్ చేయగా పోలీసు సిబ్బంది అక్కడకు వెళ్లి తల్లి కొడుకులకు సర్ది చెప్పారని అన్నారు. ఈ విషయంలో కాదా శ్రీనివాస్ కు వరసకు సోదరుడైన స్థానికుడు కాదా వెంకట రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు.
ఆ నెపంతో మంగాయమ్మను “రామాలయంలో ప్రార్ధనలు ఏ విధంగా పెడతారు” అని ఉద్దేశపూర్వకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఈ విషయం లో ఎవరిపైనా ఎలాంటి కేసులు నమోదు చేయలేదని, ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలకు నమ్మవద్దని జిల్లా ఎస్పీ ఎమ్.రవీంద్రనాథ్ బాబు తెలియజేశారు.
Unacceptable Humiliation!
Pushing conversion agenda of CM @ysjagan, Limit is crossed by Church With illegally occupying #RamMandir in #Gangavaram by a Pastor & conducting Christian Prayer in it.
All culprits must immediately be arrested.Hindus! Raise voice as #RamInsultedInAP! pic.twitter.com/Cmx3Mp6trU
— Sunil Deodhar (Modi Ka Parivar) (@Sunil_Deodhar) April 1, 2022
తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ.
తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రపురం సబ్ డివిజన్, పామర్రు పోలీస్ స్టేషన్ పరిధి లోని K గంగవరం గ్రామంలో “రామాలయంలో యేసు ప్రార్ధనలు పెట్టడం జరిగిందని” సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం అవాస్తవం.(1/5)@dgpapofficial@APPOLICE100 pic.twitter.com/ubYubiBSV9
— Kakinada District Police (@KAKINADAPOLICE) April 1, 2022