ఆజాదీ కా అమృతోత్సవంలో భాగంగా ఈనెల నాలుగున మోడీ రానున్న నేపథ్యంలో అందరి చూపు మోడీ వైపు ఉంది.. మోడీ చూపు ఆ ఊరి వైపు ఉంది. అల్లూరి జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు ఇక్కడికి విచ్చేయనున్న మోడీకి ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధం అవుతున్నాయి. అయితే మోడీ రాకతో పాటు రెబల్ ఎంపీ ట్రిపుల్ ఆర్ రాక కూడా కాక రేపుతోంది.
ఈ ఇద్దరే కాదు మరో ఇద్దరు కూడా ఇటుగానే రానున్నారు. వారే మెగా బ్రదర్స్. ఏ విధంగా చూసుకున్నా స్టార్లంతా కలిసి ఓ చోటే ఉండనున్నారు. ఇక ప్రధానికి చంద్రబాబు ఓ లేఖ రాసి చర్చకు తావిచ్చారు. పార్లమెంట్ ప్రాంగణాన అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటు చేయాలన్నది ఆయన ప్రధాన డిమాండ్.
ప్రధాని రాక నేపథ్యంలో బాబు రాసిన లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎప్పటి నుంచో ఈ ప్రతిపాదన ఉంది కానీ బాబు కదలిక తీసుకు రావడంతో వైసీపీ కూడా పునరాలోచనలో పడిపోయింది. ప్రధాని రాక ఇక్కడి భీమవరం ప్రజల్లో ఎన్నటికీ గుర్తుండి పోతుందని పేర్కొంటూ, తెలుగు ప్రజల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు మోడీ సభకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. 16 ఎకరాల్లో పెదఅమిరంలో సభకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మోడీ రాక నేపథ్యాన అన్ని పార్టీల శ్రేణులూ ఇక్కడికి రానున్నాయి. పార్టీలకు అతీతంగా అల్లూరి జయంత్యుత్సవాలను నిర్వహిస్తున్నాం అని మోడీ చెప్పిన మాట, ఇచ్చిన పిలుపు మేరకు ప్రధాన పార్టీల నాయకులు తరలి రానున్నారు.
తొమ్మిది వేల బస్సుల్లో ప్రజలను తరలించేందుకు స్థానిక బీజేపీ నాయకత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఇందుకు అల్లూరి సీతారామ రాజు ఉత్సవ కమిటీ సహకరిస్తోంది. పలు విద్యా సంస్థల బస్సులను కూడా వాడుకుంటున్నారు.
ఇక మెగాస్టార్ రాక కూడా కన్ఫం అయింది. ఉత్సవ కమిటీ ఆయన రాకను నిర్థారించింది. మరో అధినేత పవన్ కల్యాణ్ కూడా రానున్నారు అని తెలుస్తోంది. వీరే కాకుండా టీడీపీకి చెందిన ముఖ్య నాయకులు కూడా రానున్నారు. చంద్రబాబు రాకున్నా ఆయన తరఫున ప్రతినిధిగా రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు రానున్నారు.
వామ పక్ష నాయకులు కూడా ఇటుగా వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం. ఉభయ గోదావరి జిల్లాలో కమ్యూనిస్టులకూ అల్లూరి ఆరాధ్య నాయకుడు కనుక వాళ్లు కూడా వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు అల్లూరి నడయాడిన మోగల్లులో ఓ స్మారక మందిరం కట్టాలని అక్కడి గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.