ఈ నెల 17న జరగబోతోన్న తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన పార్టీలన్నీ ప్రచార జోరు పెంచాయి. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫున టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ ప్రచారానికి భారీగా జనం తరలివచ్చి…టీడీపీ గెలుపు ఖాయమని ఉత్సాహంతో చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ పై తిరుపతి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మరో 6 నెలల పాటు మాత్రమే ముఖ్యమంత్రి పదవిలో ఉంటారని, ఆ తర్వాత ఉండరు…ఉండలేరు అని మీడియా సమావేశంలో బల్లగుద్ది మరీ చెప్పడం సంచలనం రేపింది. వైఎస్ వివేకా కుమార్తె ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్ మీద ఉన్న కోపాన్ని షర్మిల తెలంగాణలో చూపిస్తున్నారని, సొంత అక్కా చెల్లెళ్లకు సమాధానం చెప్పలేని జగన్ రాష్ట్రానికి సీఎంగా ఎలా ఉంటారని నిలదీశారు. సీఎం జగన్ ధర్మయుద్ధంలో గెలవలేరని , కానీ, ప్రలోభాలకు గురిచేస్తే తాను చెప్పలేనని అన్నారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఎంత ప్రచారం చేసినా ఉపయోగం ఏమీ ఉండదని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు.
పవన్ వృథాగా శ్రమించడం తప్ప ఫలితం ఉండదని జోస్యం చెప్పారు. గతంలో కాంగ్రెస్ కు ఉన్న పరిస్థితి…నేడు బీజేపీకి ఎదురవుతోందని అన్నారు. ఇతర పార్టీలు ప్రజలను ప్రలోభాలకు గురిచేయకుంటే తిరుపతి ఉప ఎన్నికతో కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడం ఖాయమని స్పష్టం చేశారు.