సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ములాయం ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఆగస్టు చివరి వారం నుంచి గురుగ్రామ్ లోని మేదాంత హాస్పిటల్ లో ములాయంకు చికిత్స జరుగుతోంది. అక్టోబర్ 2న ఆయన పరిస్థితి విషమంగా మారడంతో ఆయనను ఐసీయూకు తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
2 రోజుల కిందటే ఆయన పరిస్థితి మరింత విషమించడంతో ప్రాణాధార ఔషధాలతో చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గౌరవనీయులైన తన తండ్రి, ప్రతి ఒక్కరి నేత ఇక లేరంటూ ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ ట్వీట్ చేశారు. 82 ఏళ్ల ములాయం శ్వాస తీసుకోవడం కష్టంగా మారిందని, మూత్రనాళ ఇన్ఫెక్షన్ ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
మరోవైపు, ములాయం మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ములాయం మరణం దేశానికి తీరని లోటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కాగా, యూపీ, దేశ రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్ జీ తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. తాను సీఎంగా ఉన్నపుడు ఎన్నో సందర్భాల్లో ఆయనతో మాట్లాడానని, సన్నిహిత సంబంధం అలాగే కొనసాగిందని గుర్తు చేసుకున్నారు. ములాయం మరణం బాధిస్తోందని, ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు తన సంతాపం అని మోదీ అన్నారు.
ములాయం మరణవార్త తనకు ఎంతో బాధ కలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తనకు అత్యంత ఆప్తులు, సోదరుడిని కోల్పోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘4 దశాబ్దాలుగా హుందా రాజకీయాలతో నన్ను ఎప్పుడూ ఆకట్టుకున్న నేత ములాయం. ఆయనతో కలిసి గతంలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తన ఆలోచనల ద్వారా లక్షలాది మంది జీవితాలను మార్చిన నేత ములాయం. అఖిలేష్ యాదవ్ సహా కుటుంబ సభ్యులకు, ఉత్తరప్రదేశ్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
ములాయం మృతిపై బీహార్ మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. ములాయం జ్ఞాపకాలు తనతో ఎప్పుడూ ఉంటాయన్నారు. ములాయం ఆత్మకు దేవుడు తన పాదాల వద్ద చోటు ఇవ్వాలని, ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ములాయం మరణం తీరని నష్టమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.