సంక్రాంతి పండుగను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తన స్వగ్రామం నారావారిపల్లెలో ఘనంగా జరుపుకున్నారు. తన సతీమణి నారా భువనేశ్వరి, తనయుడునారా లోకేశ్, కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లెలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామ దేవతలు గంగమ్మ, నాగాలమ్మలకు నారా, నందమూరి కుటుంబ సభ్యులు పూజలు చేశారు. తన తల్లిదండ్రుల సమాధి వద్ద చంద్రబాబు నివాళులు అర్పించిన అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఆ తర్వాత చంద్రగిరిలో టీడీపీ నేత పులివర్తి నానిని చంద్రబాబు పరామర్శించారు. చంద్రగిరిలో దొంగ ఓట్లపై పోరాటంలో భాగంగా నాని నిరసన చేపట్టారు. ఆ క్రమంలోనే నాని అస్వస్థతకు గురయ్యారు. దీంతో, పులివర్తి నాని ఇంటికి వెళ్లి చంద్రబాబు పరామర్శించారు. ఆ తర్వాత ఓటర్ల జాబితాలో అక్రమాలపై మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
చంద్రగిరిలో వేల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్చారని, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కొన్ని చోట్ల పోలింగ్ బూత్ లు మార్చేశారని, ఒక వ్యక్తికి మూడు బూత్ లలో ఓటు ఉందని ఆరోపించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ పై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం పులివర్తి నాని చేసే పోరాటం ధర్మపోరాటం అని,. ప్రజలు కూడా దీన్ని గుర్తించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇన్ని అక్రమాలు చేయడానికి వాళ్లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదని పరోక్షంగా వైసీపీ నేతలకు చురకలంటించారు.