టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 27 న జగన్ ప్రారంభించనున్న బస్సు యాత్ర నేపథ్యంలో జగన్ పై విమర్శలు గుప్పించారు. 2019 ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన జగన్ 2024లో ప్రజలను మోసం చేసేందుకు బస్సు యాత్ర చేపడుతున్నారని దుయ్యబట్టారు. గత హామీలపై బదులిచ్చాకే బస్సు ఎక్కాలని జగన్ కు చంద్రబాబు సవాల్ విసిరారు.
99 శాతం హామీలను అమలు చేశామంటున్నారని, కానీ, 99 శాతం హామీలపై ప్రజలను జగన్ ఏమార్చారని ఫైర్ అయ్యారు. ‘హామీల అమలు ఓ బూటకం.. విశ్వసనీయతపై జగన్ కబుర్లు అతిపెద్ద నాటకం’అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఐదేళ్ల పదవీకాలాన్ని విధ్వంసాలకు, దోపిడీకి, కక్షా రాజకీయాలకు వెచ్చించారని జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు.
జగన్ ఇచ్చిన 99 హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదంటూ నారా లోకేశ్ చేసిన వీడియో ట్వీట్ ను చంద్రబాబు రీట్వీట్ చేశారు. ‘జగన్ రెడ్డి 99 మోసాలు.. ఏమార్చిన 99 హామీలు’ అంటూ లోకేశ్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీనికి ‘హామీలు నెరవేర్చి ఓట్లు అడగడానికి వస్తా అన్నావ్.. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తావ్ జగన్. అయినా పరదాలు ఉండగా నీకేంటి సిగ్గు!’ అంటూ లోకేశ్ సెటైరికల్ ట్వీట్ చేశారు.