విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా భారత్ లోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఐటీ శాఖా, పరిశ్రమల శాఖా మంత్రులు దావోస్ లో పర్యటిస్తుంటారన్న సంగతి తెలిసిందే. అయితే, భారత్ నుంచి తొలిసారిగా దావోస్ లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న విషయం మాత్రం అతికొద్ది మందికే తెలుసు. తాజాగా ఈ విషయంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్ లో పర్యటనలకు ఆద్యుడిని తానేనని, ఆ ఆలోచన వచ్చిన తొలి సీఎం తానే అని అన్నారు.
దావోస్ నుంచి వచ్చిన తర్వాత తన పర్యటన వివరాలను మీడియాకు వెల్లడించిన సందర్భంగా చంద్రబాబు కీలక విషయాలు వెల్లడించారు. 1997 మొదలే సీఎంగా ఉన్న ప్రతి టర్మ్ లో దావోస్ లో పర్యటించి ఏపీకి విదేశీ పరిశ్రమలను తెచ్చానని గుర్తు చేసుకున్నారు. 1997లో హైదరాబాద్ కు సరైన ఎయిర్ పోర్ట్ లేదని, దావోస్ లో హైదరాబాద్ పేరు ఎవరికీ తెలీదని చెప్పారు. ఐటీ గురించి మాట్లాడుకుంటున్న సమయంలో హైటెక్ సిటీ నిర్మించామని, దాంతో పాటు సైబర్ సిటీ నిర్మాణం చేపట్టామని తెలిపారు.
1995 లో ఐటీ యుగమని, ఇప్పుడు 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) యుగమని చంద్రబాబు చెప్పారు. బిల్ గేట్స్ కూడా హైదరాబాద్ గురించి ప్రస్తావించారని, ఆ మాదిరిగా ఇప్పుడు ఏపీని ప్రమోట్ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారని అన్నారు. విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ ను ప్రమోట్ చేసేందుకు అన్ని వేదికలనూ ఉపయోగించుకుంటానని చంద్రబాబు వివరించారు. దావోస్ అంటే క్రైటీరియా కాదని, అదొక నెట్ వర్కింగ్ అని అన్నారు. ప్రభుత్వ అధినేతలోతపాటు పారిశ్రామికవేత్తలూ వస్తారని, వారితో నెట్ వర్కింగ్ చేసుకొని నాలెడ్జ్ పెంచుకోవాలని చెప్పారు.
జూరిచ్ లో దాదాపు 500 మంది తెలుగు వాళ్లు తనను కలిశారని, చాలామంది కంపెనీలు పెట్టి విజయవంతంగా నడిపిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం 100 దేశాల్లో తెలుగువాళ్లు ఉన్నారని, వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోని అన్ని దేశాల్లో తెలుగువాళ్లు ఉండాలని ఆకాంక్షించారు.