వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా పత్రాన్ని విజయసాయి రెడ్డి నేడు అందించారు. విజయసాయిరెడ్డి రాజీనామాను ఆయన ఆమోదించారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తో మాట్లాడిన తర్వాతే, ఆయనకు అన్ని విషయాలు వివరించిన తర్వాతే రాజీనామా చేస్తున్నానని సాయిరెడ్డి చెప్పారు.
రాజకీయాలకు ఇకపై దూరంగా ఉంటానని, ఎటువంటి వ్యాపారాలు లేవని చెప్పారు. తన రాజీనామా పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆపాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. కేవీ రావుతో తనకు పరిచయం లేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తానున్న పరిస్థితుల్లో, పార్టీకి, పదవికి న్యాయం చేయలేనని, అందుకే తన స్థానంలో వేరే వారు వస్తే మెరుగుగా పనిచేస్తారని రాజీనామా చేశానని అన్నారు.
తన పిల్లల సాక్షిగా చెబుతున్నానని, కాకినాడ పోర్టు వ్యవహారంలో తనకు సంబంధం లేదని విజయసాయిరెడ్డి అన్నారు. కాకినాడ పోర్టు కేసు వ్యవహారంలో తనను ఏ-2గా ఈడీ చేర్చిందని, చట్ట ప్రకారం ఆ కేసును ఎదుర్కొంటానని అన్నారు. ఎంపీ పదవికి మాత్రమే రాజీనామా చేశానని, వైసీపీకి రాజీనామా చేయలేదని చెప్పారు.