ఏపీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. నిత్యం ప్రజల కోసం పాటుపడుతున్న చంద్రబాబు.. తాజాగా తన విరాభిమాని చివరి కోరికను నెరవేర్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రేణిగుంటకు చెందిన పసుపులేటి సురేంద్రబాబు (30) పుట్టుకతోనే మానసిక వికలాంగుడు. దానికి తోడు ఇటీవల అతను లివర్ క్యాన్సర్ బారిన పడ్డారు. క్యాన్సర్ నాలుగో దశలో ఉండటం వల్ల సురేంద్రబాబు బతికే అవకాశాలు లేవని డాక్టర్లు తేల్చేశారు.
అయితే సురేంద్రబాబుకు చిన్నతనం నుంచి చంద్రబాబు అంటే అంతులేని ప్రేమ మరియు అభిమానం. చనిపోయే లోపు తన అభిమాన నాయకుడిని కలిపి.. ఆయనతో ఒక్క ఫోటో అయినా దిగాలని సురేంద్రబాబు కోరుకున్నాడు. స్థానిక నాయకుల ద్వారా ఈ విషయం చంద్రబాబుకు చేరింది. మృత్యువుతో పోరాడుతున్న అభిమాని చివరి కోరిక తీర్చాలని బాబు భావించారు.
తిరుపతిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు.. శనివారం ఉదయం పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం ప్రారంభించారు. రేణిగుంటలో విమానం ఎక్కేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్తున్న సమయంలో సురేంద్రబాబును అక్కడకు పిలిపించుకున్నారు. ఎయిర్ పోర్ట్ గేటు వద్ద వాహనం దిగి సురేంద్రబాబును చంద్రబాబు పరామర్శించారు.
కాసేపు అతనితో మాట్లాడి.. ఆపై సురేంద్రబాబుతో ఫోటో దిగారు. అలాగే చికిత్స నిమిత్తం రూ.5 లక్షల చెక్కును కూడా చంద్రబాబు అందజేశారు. తన అభిమాన నాయకుడుతో కలిపి ఫోటో దిగడంతో సురేంద్రబాబు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొడుకు చివరి కోరికను చంద్రబాబు తీర్చడం, ఆర్థికంగా కూడా మద్దతు ఇవ్వడంతో సురేంద్రబాబు తల్లిదండ్రులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. నెటిజన్లు దటీజ్ చంద్రబాబు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.