2024 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీలో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, మరోసారి జగన్ కు చాన్స్ దక్కదని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇక, రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. జిల్లాల వారీగా వరుస పర్యటనలతో హోరెత్తించిన చంద్రబాబు…ఇప్పుడు మినీ మహానాడులలోనూ అదే ఊపు కొనసాగిస్తున్నారు.
రాబోయే ఎన్నికల కోసం కొత్త రూటులో వెళుతున్న చంద్రబాబు ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ముందుగానే ఖరారు చేస్తారని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే రాజంపేట లోక్ సభ స్థానం నుంచి గంటా నరహరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు.
రాజంపేటకు చెందిన గంటా నరహరి బెంగళూరులో బిజినెస్ మ్యాన్ గా ఉన్నారు. 2017-2018లో రాష్ట్రపతి నుంచి ఉత్తమ యువ పారిశ్రామికవేత్తగా అవార్డు అందుకున్న నరహరి కుటుంబం చాలా కాలంగా రాజకీయాల్లో కొనసాగుతోంది. దివంగత ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు భార్య దివంగత సత్యప్రభ సోదరి కుమార్తెను నరహరి పెళ్లి చేసుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి సత్యప్రభ ఓడిపోయారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో ఆమె మరణించారు.
కాగా, మదనపల్లెలో టీడీపీ మినీ మహానాడు సందర్భంగా చంద్రబాబు చూపుడు వేలికి ప్లాటినం ఉంగరం కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. అది కేవలం ఉంగరం కాదని, తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేసే పరికరమని నేతలకు చంద్రబాబు వివరించారు. ప్లాటినం ఉంగరంలో ఉన్న చిప్ తన హార్ట్ బీట్, స్లీపింగ్ అవర్స్, డైట్, తదితర అంశాలన్నింటినీ రికార్డు చేస్తుందని చెప్పారు. ఆ రికార్డు చెక్ చేసుకొని తన ఆరోగ్యాన్నికాపాడుకుంటానని తెలిపారు.
తన లాగే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అయితే, ఎప్పుడూ సాదాసీదాగా సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే చంద్రబాబు చేతికి కొత్తగా రింగ్ వచ్చిందని, ఆ రింగ్ ఆయనకు లక్ తెస్తుందని, ఇక, 2024 ఎన్నికల్లో చంద్రబాబే రింగ్ మాస్టర్ అని తెలుగు తమ్ముళ్లు ఫుల్ జోష్ లో ఉన్నారు.