ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బకు విలవిలమంటోంది వైసీపీ. అసలేం జరిగిందంటే.. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక హైపర్ యాక్టివ్ గా వ్యవహరించిన పవన్ కళ్యాణ్.. ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ముఖ్యమైన అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశానికి కూడా జనసేనాని డుమ్ము కొట్టారు. ఈ సమయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకొని పవన్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధ పడుతున్నారని.. అందుకే మీటింగ్ హాజరు కాలేదని తెలిపారు. అప్పుడే తాను ప్రయత్నించినా పవన్ అందుబాటులోకి రాలేదని సమావేశంలో చంద్రబాబు ఓపెన్ గా చెప్పటంతో వైసీపీ గేమ్ స్టార్ట్ చేసింది.
టీడీపీ వైకరి వల్ల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు తలెత్తాయని.. సీఎం స్వయంగా ఫోన్ చేసినా డిప్యూటీ సీఎం ఎత్తడం లేదంటూ వైసీపీ జోరుగా ప్రచారం చేసింది. పైగా కేబినెట్ భేటీ ముగిసిన మరుసటి రోజే పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టారు. దీంతో వైసీపీ చేస్తున్న ప్రచారానికి మరింత బలం చేకూరినట్లైంది. అనారోగ్యం వల్ల మీటింగ్ కు హాజరుకాని పవన్.. నాలుగు రోజుల పాటు తీర్థయాత్రలకు ఎలా వెళ్తున్నారంటూ సందేహాలు రేకెత్తించారు. అయితే తాజాగా వాటన్నిటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెక్ పెట్టారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ 28వవార్షికోత్సవం సందర్భంగా తలసేమియా బాధిత చిన్నారులను ఆదుకునేందుకు శనివారం సాయంత్రం నిధుల సేకరణ కోసం విజయవాడలో యుఫోరియా మ్యూజికల్ నైట్ పేరిట నారా భువనేశ్వరి ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణ, మంత్రులు, ప్రజాప్రతినిధులు, టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
ఈవెంట్ లో చంద్రబాబు, పవన్, బాలయ్య ఒకే టేబుల్ వద్ద కూర్చుని ఎంతో క్లోజ్ గా మాట్లాడుకున్నారు. తమన్ సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉల్లాసంగా కనిపించారు. గత నాలుగు రోజులుగా ఆలయాల సందర్శనలో బిజీగా ఉన్న పవన్.. చివరి నిమిషం వరకు వస్తారా లేదా అన్నది అనుమానమే. కానీ, నారా భువనేశ్వరికి ఇచ్చిన మాట కోసం పవన్ తన పర్యటన ముగించుకొని కార్యక్రమానికి హాజరయ్యారు. తలసేమియా బాధితులకు అండగా నిలిచేందుకు ఏకంగా రూ. 50 లక్షలను విరాళం ప్రకటించారు. అంతకుమించి చంద్రబాబుతో చాలా చనువుగా వ్యవహరించి వైసీపీ చేస్తున్న ప్రచారానికి పవన్ కళ్యాణ్ చెక్ పెట్టారు.