ఏపీ పోలీసులు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసును నమోదు చేశారు. విజయనగరం జిల్లా రామతీర్థం వద్ద శనివారం చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కారుపై దాడి జరిగిన ఉదంతంపై చంద్రబాబుపై కేసు నమోదైంది. విజయసాయి కారుపై చంద్రబాబే కారు దాడి చేయించారన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ పోలీసులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
రామతీర్థం క్షేత్రంలో శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయటం.. ఈ ఉదంతం పెను సంచలనంగా మారటంతో పాటు.. రాజకీయ రగడగా మారటం తెలిసిందే. శనివారం టీడీపీ.. బీజేపీతో పాటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోటాపోటీగా పర్యటనలు చేయటం.. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవటం తెలిసిందే.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కారుపై దాడి చేయటం.. వాహనం దెబ్బ తినటం తెలిసిందే. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంపై మాజీ సీఎం చంద్రబాబుతో పాటు..పార్టీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు.. కళా వెంకట్రావులపై కేసు నమోదు చేసినట్లుగా ఏపీ పోలీసులు వెల్లడించారు. వీరి ముగ్గురిపై పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దీనిపై చంద్రబాబుతో పాటుటీడీపీ నేతలు స్పందించాల్సి ఉంది.