ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో యువత, మహిళలు, బీసీ, ఎస్సీ సెల్ వంటి పలు విభాగాలు ఉన్నాయి.
ఆయా విభాగాల ప్రజల సమస్యలను తెలుసుకుని, ఈ సెల్స్ వాటి పరిష్కారం కోసం పనిచేస్తున్నాయి.
అయితే ఇప్పటి వరకు లేని విధంగా తొలి సారి `బ్రాహ్మణ సాధికార సమితి`ని టీడీపీ ఏర్పాటు చేసింది.
తద్వారా ఏపీలోని బ్రాహ్మణ సామాజిక వర్గం సమస్యలను తెలుసుకోవ డంతోపాటు, వారిని సంఘటితం చేయాలనేది ప్రధాన సంకల్పం.
అదే విధంగా బ్రాహ్మణ సమస్యలపై పోరాటం చేసేందుకు కూడా ఈ సమితి కృషి చేయనుంది.
అలాగే ప్రస్తుత ప్రభుత్వం బ్రాహ్మణులకు ఏ విధంగా అన్యాయం చేస్తోంది? టీడీపీ హయాంలో ఎలాంటి పథకాలు అమలు చేశారు.? అనే విషయాలపై కూడా ఈ సమితి ఆ సామాజిక వర్గానికి పూస గుచ్చినట్టు వివరించనుంది.
ఏపీలో 5 శాతం ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లను సంఘటితం చేయడం ద్వారా అభివృద్ధి వైపు వారిని నడిపించే ఉద్దేశం కూడా పెట్టుకుంది.
ఇక, తొలిసారి ఏర్పాటు చేసిన టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితికి ప్రవాసాంధ్రుడు(ఎన్నారై) ‘బుచ్చి రాం ప్రసాద్’ను కన్వీనర్‌గా నియమించారు.
మెంబర్ గా శిష్ట్లా లోహిత్‌ను నియమించారు. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటన జారీ చేశారు.
కాగా, ఎన్నారై ‘బుచ్చి రాం ప్రసాద్’ను కన్వీనర్‌గా నియమించడం పట్ల, పలువురు ఎన్నారైలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
బ్రాహ్మణ సామాజిక వర్గానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.
ఇదిలావుంటే.. టీడీపీ 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి దేశంలో ఎక్కడా లేని విధంగా `బ్రాహ్మణ కార్పొరేషన్`ను ఏర్పాటు చేసింది.
దీనికి తొలుత మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్నారావును నియమించింది.
తద్వారా బ్రాహ్మణుల్లో వెనుకబడిన వారికి రుణాలు ఇవ్వడం, విద్యకు దోహద పడేలా సాయం అందించడం, బ్రాహ్మణ వితంతు మహిళలకు పింఛన్లు, యువతకు ఉపాధి, వేద విద్య వంటివాటిని అందించడం ద్వారా ఆదుకున్నారు.
ప్రస్తుతం ఈ కార్పొరేషన్ పేరు కు మాత్రమే ఉండడం గమనార్హం.
దీని వల్ల ఎవరికి ఎలాంటి లబ్ధి చేకూరిందో సర్కారుకే తెలియాలని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.