ఫిబ్రవరి తర్వాత సినిమాలకు, బాక్సాఫీస్ కు అంతగా కలిసి రాని నెలగా నవంబరుకు పేరుంది. అందుకే ఈ నెలలో మిడ్ రేంజ్ సినిమాలు కూడా పెద్దగా రిలీజ్ కావు. ఈ నెలలో ఈసారి దీపావళి పండుగ వచ్చినప్పటికీ క్రేజున్న సినిమాల రిలీజ్ లేకపోయింది. ఈ నెల ఆరంభంలో ‘మా ఊరి పొలిమేర-2’ అనే చిన్న సినిమా బాగానే సందడి చేసింది. ‘కీడా కోలా’ ఓ మోస్తరుగా ఆడింది. కానీ తర్వాతి వారంలో దీపావళి పండుగ సందర్భంగా తెలుగులో రిలీజ్లే లేకపోయాయి.
అనువాద చిత్రాలైన జపాన్, జిగర్ తండ డబుల్ఎక్స్, టైగర్-3 రిలీజయ్యాయి. పేరుకు మూడు సినిమాలున్నాయి కానీ.. వాటిలో ఏదీ సత్తా చాటలేదు. దీంతో బాక్సాఫీస్ డల్లయిపోయింది. దీంతో ప్రేక్షకులు వారం పాటు పెద్దగా థియేటర్ల వైపు చూడలేదు. ఐతే ఈ వారం మళ్లీ ప్రేక్షకుల్లో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. అందుకు ప్రధాన కారణం.. మంగళవారం.
‘ఆర్ఎక్స్ 100’తో సెన్సేషన్ క్రియేట్ చేశాక ‘మహాసముద్రం’తో అంచనాలు అందుకోవడంలో విఫలమైన అజయ్ భూపతి.. ‘మంగళవారం’తో బౌన్స్ బ్యాక్ అయ్యేలాగే కనిపించాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాయి. ఈ చిత్రానికి ప్రి రిలీజ్ హైప్ బాగానే కనిపించింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. ముందు రోజు వివిధ నగరాల్లో పెయిడ్ ప్రిమియర్స్ వేస్తే అవన్నీ ఫుల్ అయిపోయాయి. ఓపెనింగ్స్‌కు ఢోకా లేనట్లే ఉంది.
సినిమాకు మంచి టాక్ వస్తే అజయ్ మళ్లీ పెద్ద హిట్ కొట్టినట్లే. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే టాలీవుడ్ బాక్సాఫీస్ కూడా బౌన్స్ బ్యాక్ అయినట్లే. దీంతో పాటుగా కన్నడ అనువాద చిత్రం ‘సప్త సాగరాలు దాటి-బి’, ‘స్పార్క్’ అనే ఓ థ్రిల్లర్ మూవీ కూడా రిలీజవుతున్నాయి. ఇవి కూడా కొంచెం బజ్ తెచ్చుకున్నాయి. మరి వీటికి టాక్ ఎలా ఉంటుందో.. అవెలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.