దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిన ప్రధాన నగరాల్లో టికెట్ల ధరలు కొంచెం ఎక్కువే. ముఖ్యంగా అక్కడ మల్టీప్లెక్సులదే రాజ్యం. వాటిలో రేట్లు సింగిల్ స్క్రీన్లతో పోలిస్తే ఎక్కువగానే ఉంటాయి. హిందీ సినిమాలు ఒక దశలో ఎక్కువగా మల్టీప్లెక్సులనే టార్గెట్ చేశాయి. కానీ కొవిడ్ టైంలో హిందీ సినిమాల పరిస్థితి దయనీయంగా తయారై.. వాటి మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. తిరిగి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం సవాలుగా మారిపోయింది.
ఐతే ఈ మధ్య నెమ్మదిగా హిందీ ఆడియన్స్ మనసు మారుతోంది. మునుపట్లా థియేటర్లకు కదులుతున్నారు. వారిని మరింత ఎంకరేజ్ చేసేలా.. సమయోచితంగా టికెట్ల ధరలను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. గత ఏడాది ‘బ్రహ్మాస్త్ర’ సినిమా రిలీజైన కొన్ని రోజులకు ఆఫర్ల పేరుతో రేట్లు తగ్గించడం బాగా కలిసొచ్చింది. నేషనల్ సినిమా డే లాంటి సందర్బాలను వాడుకుని ఈ సినిమా మంచి ప్రయోజనం పొందింది. ఇప్పుడు ‘పఠాన్’ సినిమాకు రన్ పెంచడానికి చిత్ర బృందం తెలివైన ఎత్తుగడ వేసింది. మల్టీప్లెక్సులన్నింట్లో 112 రూపాయల కామన్ రేటు పెట్టేశారు. దీంతో సినిమా రిలీజై నాలుగు వారాలు కావస్తున్నా మంచి ఆక్యుపెన్సీ దక్కుతోందీ చిత్రానికి.
‘పఠాన్’ మేకర్స్ ఎత్తుగడ చూసి.. ఈ రోజు రిలీజైన ‘భూల్ భులయియా-2’ సినిమా విషయంలోనూ మేకర్స్ ‘తగ్గక’ తప్పలేదు. ఈ సినిమాకు ఇండియా వైడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టేయడం విశేషం. బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకునేవాళ్లందరికీ ఈ సౌలభ్యం లభిస్తోంది. ఇలా అందుబాటులో టికెట్ల ధరలు ఉంటే కచ్చితంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందనడంలో సందేహం లేదు.