పలు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై ఇటీవల కాలంలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఏది ఉచితం.. ఏది అనుచితం.. అనే విషయంపై సుప్రీం కోర్టు కూడా.. డోలాయమానంలో పడింది ఈ క్రమంలో ఈ విషయం ఏంటో.. తేల్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని.. ఆదేశించింది. ఈ పరిణామాల క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అసలు ఉచితాలపై ఏమనుకుంటోందో చెప్పాలని.. ఈసీ కోరింది. దీనిపై తాజాగా బీజేపీ సుదీర్ఘ లేఖ రాసింది. దీనిలో.. `ఉచిత విద్యుత్`(ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్నాయి) పథకం వేస్ట్ అని తేల్చేసింది.
అంతేకాదు.. ఉచితాలపై ప్రజలు ఆధారపడేటట్లు చేయడం సరికాదని, బదులుగా ఓటరు చైతన్యంపై రాజకీయ పార్టీలు దృష్టిపెట్టాలని బీజేపీ పేర్కొంది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రకటించే తాయిలాలు, ప్రజాసంక్షేమ పథకాల మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ లేఖ రాసింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చే వాగ్దానాలు ఎలా నెరవేర్చుతారనే అంశంపై రాజకీయ పార్టీల నుంచి ఈసీ వివరణ కోరిన నేపథ్యంలో ఈ మేరకు స్పందించింది. ఓటరు చైతన్యంపై రాజకీయ పార్టీలు దృష్టిసారించాలే తప్ప.. ప్రజలు ఒకరిపై ఆధారపడి జీవించేలా చేయకూడదని బీజేపీ స్పష్టం చేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆలోచనలకు అనుగుణంగా ఈసీకి తమ స్పందన తెలియజేసినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. “ఉచితాలు అనేవి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రకటించేవి. సంక్షేమం అనేది సమ్మిళిత వృద్ధికి సంబంధించిన అంశం. ఎన్నికల వాగ్దానాలకు సంబంధించి ఆర్థిక సాధ్యాసాధ్యాలపై పార్టీల నుంచి ఈసీ నివేదిక కోరడాన్ని మేం స్వాగతిస్తున్నాం. ప్రజలకు ఇళ్లు, ఉచిత రేషన్ ఇవ్వడం సంక్షేమ కార్యక్రమాలు. వీటిని ఉచితాలుగా పరిగణించలేం. కానీ, ఉచిత విద్యుత్ అనేది ఈ కోవలోకి రాదు. ఇది వేస్ట్. పైగా.. ప్రభుత్వాలకు భారం. ప్రధాని మోడీ ఆలోచనలకు అనుగుణంగా ఈసీకి మా స్పందన తెలియజేశాం“ అని బీజేపీ నాయకుడు పేర్కొన్నారు.
ఉచితాల విషయంలో ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య చాలా రోజులుగా వివాదం నడుస్తోంది. తమ నుంచి వసూలు చేసిన డబ్బును ఉచితాలకు ఉపయోగిస్తే పన్ను చెల్లింపుదారులు ఎంతో బాధపడతారంటూ కొద్ది రోజుల క్రితం ప్రధాని వ్యాఖ్యానించారు. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ధరల పెరుగుదలతో బాధపడుతున్న సామాన్య ప్రజలకు విద్య, వైద్యాన్ని ఉచితంగా ఎందుకు అందించకూడదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. అటువంటి వాటిని ఉచితాలు అని పేర్కొంటూ సామాన్య పౌరుడిని అవమానపరచొద్దని హితవు పలికారు. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ తన వాదనను వినిపించింది. అయితే.. ప్రస్తుతం మునుగోడు ఉ పపోరు నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలు.. ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు బీజేపీ వ్యతిరేకమని ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. బీజేపీపై ప్రభావం పడుతుందని అంటున్నారు పరిశీలకులు.